కరోనా సంక్షోభం వల్ల 2019-20తో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 15.7 శాతం క్షీణించింది. అందువల్ల 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం మూడేళ్లు ఆలస్యమై 2031-32కు సాకారం కావచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా వేసింది.
ప్రభుత్వ లక్ష్యం 2030..
ప్రస్తుతం భారత్ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జర్మనీ వెనుక ఉంది. 2030 నాటికి 5 లక్షల కోట్ల డాలర్లతో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
'2031-32 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచే అవకాశం ఉంది. ఇంతకు ముందు 2028-29 నాటికే ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ.. కరోనా సంక్షోభం ప్రతికూలంగా మారింది. 9 శాతం వృద్ధితో అయితే 2031 నాటికి, 10 శాతం వృద్ధితో 2030కి జపాన్ జీడీపీ (డాలర్ల ప్రాతిపదికన)ని తాకొచ్చు' అని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం వివరాలను నివేదిక వెల్లడించలేదు.
నివేదిక పరిగణించిన అంశాలు..
2019-20లో భారత ఆర్థిక వ్యవస్థ 2.65 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఇక 2020లో జపాన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.87 లక్షల కోట్ల డాలర్లు కావడం గమనార్హం. 6 శాతం వాస్తవిక వృద్ధి, 5 శాతం ద్రవ్యోల్బణం, 2 శాతం రూపాయి క్షీణతలను పరిగణనలోకి తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. 2027-28 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని 2017లో బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా వేసింది. స్థిరమైన వృద్ధికి ముడిచమురు ధరలు ఒక్కటే అడ్డంకిగా అభిప్రాయపడింది.
ఇదీ చదవండి:మారటోరియం కాలానికి రుణమాఫీ అసాధ్యం: సుప్రీం