దేశంలో డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీతో ముందుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ . లాక్‌డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థను బలపరచాలంటే ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టడమే ఉత్తమ మార్గమని ఆయన విశ్లేషించారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాలు వెల్లడించారు అభిజిత్. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా, జపాన్, ఐరోపా తరహాలోనే భారత్ కూడా భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని సూచించారు.
రుణాల చెల్లింపుపై మారటోరియం విధింపును తెలివైన నిర్ణయంగా అభివర్ణించారు అభిజిత్. అయితే అంతకంటే ఎక్కువే చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ త్రైమాసికానికి రుణాల చెల్లింపులు రద్దు చేసి.. ప్రభుత్వమే వాటి బాధ్యత తీసుకోవచ్చని సూచించారు.
పేదలకే పరిమితం కావద్దు..
కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన 'న్యాయ్' పథకం ఇంలాంటి సమయాల్లో తోడ్పడుతుందా అని రాహుల్ గాంధీ అడగ్గా.. "ప్రత్యక్ష నగదు సాయాన్ని పేదలకు మాత్రమే పరిమితం చేయడం తగదు" అని అన్నారు బెనర్జీ.