సాధారణంగా ఆర్థికపరమైన అంశాల్లో ఎక్కువ మంది చేసే అలావాట్లు వాటి నుంచి తప్పించుకుంటే ఎలాంటి లాభాలు ఉంటాయనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
1. ఆలస్యంగా బిల్లుల చెల్లింపు
మనం ఎన్నో సేవలు పొందుతుంటాం. వాటన్నింటికీ ప్రత్యేకమైన బిల్లింగ్ తేదీ అంటూ ఉంటుంది. ప్రతినెలా ఈ బిల్లులన్నింటిపై దృష్టిసారించడం ఒక రకంగా కష్టమే. ఆలస్యంగా చెల్లించి, అందుకు రుసుములు చెల్లించడమంటే జరిమానా చెల్లింపుతో సమానం. అంటే, కష్టపడి సంపాదించినదాన్ని ఒక రకంగా వృథా చేయడమే. దీన్ని అరికట్టేందుకు బిల్లుల చెల్లింపు ‘ఆటోమేట్’ చేయండి. నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు నుంచి ఆయా బిల్లులు నేరుగా, నిర్ణీత తేదీనాడు చెల్లింపులు జరిగిపోయేలా సూచనలు ఇవ్వండి. ఇలా చేస్తే.. ఆలస్యం జరిగి సేవల్లో అంతరాయం ఏర్పడటంలాంటివి నిరోధించడమే కాదు.. అనవసర జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు.
2. వాయిదాల చెల్లింపులో అలసత్వం
ఒకసారి రుణం తీసుకున్నామంటే.. దాని వాయిదాల చెల్లింపులు ఎప్పటికప్పుడూ క్రమం తప్పకుండా చూసుకోవాలి. చెల్లించకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఉండవనుకుంటే.. పొరపాటే అవుతుంది. అప్పు తీసుకున్న సంస్థ నుంచి మీ రుణ చరిత్రను తీసుకుని, సిబిల్ వంటి క్రెడిట్ రేటింగ్ సంస్థలు నమోదు చేస్తుంటాయి. ఆలస్య చెల్లింపులకు సంబంధించిన కారణాలేమైనా ఉండొచ్చు. అవి వాస్తవమైనా లేదా పూర్తిగా మీ నిర్లక్ష్యమే కారణమైనా దాని ప్రభావం మీ రుణ చరిత్రపై పడుతుంది. ఫలితంగా మీ క్రెడిట్ స్కోరు తగ్గి, కొత్త రుణం, క్రెడిట్ కార్డులను తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. మీ చెల్లింపులు ఎల్లప్పుడూ సకాలంలో జరిగేలా చూసుకోండి. నిజంగానే మీరు ఏదైనా సమస్యలో ఉంటే, దానిని సంబంధిత రుణ సంస్థతో చర్చించి, చెల్లింపుల నిబంధనల్లో మార్పులు చేయించుకోండి.
3. 'కనీసం' చెల్లించడం..
క్రెడిట్ కార్డు వాడటం మాత్రమే సరిపోదు.. దానికి సంబంధించిన బిల్లులు కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలి. కానీ, కొంతమంది ఎప్పటికప్పుడు కనీస మొత్తం చెల్లించి నడిపించేస్తుంటారు. అత్యవసరం అయి, పూర్తి బిల్లు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇది కొంత వరకూ నయమే. క్రెడిట్ కార్డుపై బాకీ అంటే మీరు తీసుకునే అప్పుల్లో చాలా ఖరీదైనది. ఎంత తక్కువ మొత్తం బాకీ ఉంటే ఆర్థికంగా అంత క్షేమం. కాబట్టి, నెలనెలా కార్డు బాకీని ఒకేసారి, సకాలంలో చెల్లించేయండి.
4. ఖర్చు ముందు.. పొదుపు తర్వాత..
డబ్బు రాగానే ఖర్చు చేద్దాం.. పొదుపు గురించి నెలాఖరున ఆలోచిద్దాం.. ఈ అలవాటు.. పెద్ద పొరపాటు.. పొదుపు, మదుపులకు పెద్ద అవరోధం. ముందు పొదుపు చేయాలి.. తర్వాతే ఖర్చు చేయాలి అనే నిబంధనను విధించుకోవాలి. ఆర్థిక ప్రణాళికలో ఇది అతి ముఖ్యమైన వ్యూహం. ఖర్చుల నియంత్రణకూ ఇది మంత్రంలా పనిచేస్తుంది.
5. బీమా.. పట్టించుకోకపోవడం..
ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లో బీమా తీసుకోవడమే చాలామందికి అలవాటు. అదీ పన్ను మినహాయింపు కోసమే అనుకుంటారు. ఒకసారి ఈ మినహాయింపు పొందాక.. ఆ పాలసీ అమల్లో ఉందో లేదో కూడా తెలీదు. దురదృష్టవశాత్తూ వారికి ఏదైనా జరిగితే.. వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు అది ఏమాత్రం ఉపయోగపడదు. మంచి బీమా పాలసీ అంటే.. కుటుంబ సభ్యులకు మీ తర్వాత.. మీ ఆదాయానికి ప్రత్యామ్నాయం చూపేదిగా ఉండాలి. కాబట్టి, మీపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు వారి అవసరాలన్నింటినీ జాగ్రత్తగా గణించి, ఎంత బీమా తీసుకోవాలో తెలుసుకోండి.