మోదీ 2.0 ప్రభుత్వం రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో పద్దు ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ వచ్చిన ప్రతిసారి అన్ని వర్గాల్లో ఎన్నో అంచనాలు.. మరెన్నో ఆశలు ఉంటాయి. అలా ఈ సారి బడ్జెట్‌పై వ్యవసాయ రంగం అంచనాలు ఎలా ఉన్నాయి? ఈ విషయం తెలుసుకునేందుకు ఛాంబర్ ఆఫ్ ఫుడ్ &అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఛైర్మన్ డా.ఎంజే ఖాన్‌ను సంప్రదించింది ఈటీవీ భారత్.
ఖాన్ ఏమన్నారంటే..
రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు వ్యవసాయ రంగ ఎగుమతులు రెట్టింపు చేయాల్సిన అవసరముందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపిన విషయాన్ని ఖాన్ గుర్తు చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలపై కసరత్తు అవసరమని.. రానున్న బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రోవిజన్లు ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయ రంగంలో అభివృద్ధి నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కనుక దేశ ఆర్థిక స్థితి కోణంలో.. వ్యవసాయ రంగంలో పలు కొత్త పథకాలు అవసరమని ఖాన్ తెలిపారు. వాటితోపాటు ఇప్పటికే ఉన్న కొన్ని పాలసీల్లో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రోవిజన్లూ ఉండొచ్చని ఆశిస్తున్నట్లు ఖాన్ తెలిపారు.