కొన్ని రోజులుగా నిత్యావసరాలు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ జాబితాలో ఉల్లి ముందుంటుంది. కోసేటప్పుడు రావాల్సిన కన్నీళ్లు కొనేటప్పుడే వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఉల్లి ధరలు భారీ స్థాయిలో పెరిగాయి.
కొద్ది రోజుల క్రితం దేశంలో కొన్ని చోట్ల ఉల్లి ధరలు రూ.200 చేరుకున్నాయి. ఈ దెబ్బతో టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్లో 8 నెలల గరిష్ఠానికి చేరింది. ఇప్పుడు వంటనూనెలు కూడా అదే మార్గంలో వెళుతున్నాయి. పప్పుల ధరలూ పెరుగుతున్నాయి.
ఐదున్నరేళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం
గతేడాది డిసెంబర్లో చిల్లర ధరల ద్రవ్యోల్బణం 7.35 శాతానికి చేరి ఐదున్నరేళ్ల గరిష్ఠాన్ని తాకింది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో 5.54 శాతం ఉండగా.. 2018 డిసెంబర్లో 2.11 శాతం మాత్రమే ఉంది. కూరగాయల ధరలు 2019 డిసెంబర్లో 60.5 శాతం, నవంబర్లో 36 శాతం పెరిగాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే బాధ్యత రిజర్వు బ్యాంకుపై ఉంచింది ప్రభుత్వం. ఆరు శాతం లోపు (4±2 శాతం ధరల పెరుగుదల) ద్రవ్యోల్బణం ఉండే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి. పై గణాంకాలు మాత్రం దీనికి చాలా దూరంలో ఉన్నాయి. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బడ్జెట్లో కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సదుపాయాలు కల్పించాలి..
కొన్ని కూరగాయలు తొందరగా పాడైపోతుంటాయి. దీనివల్ల కూరగాయల ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు వస్తుంటాయి. అయితే ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శీతల గిడ్డంగుల సంఖ్య పెంచేందుకు నిధులు కేటాయించాలని వారు సూచిస్తున్నారు.
దళారీ వ్యవస్థ...
ధరలు అదుపులోకి వచ్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది నిపుణుల మాట. ధరల పెరుగుతున్నప్పటికీ.. రైతులకు మాత్రం ఆ ప్రయోజనం చేకూరట్లేదని వారు అంటున్నారు. వినియోగదారులపైనా భారం పడుతోందని చెబుతున్నారు. క్రయవిక్రయాల్లో దళారీ వ్యవస్థను తొలగించాలని రైతులు, విశ్లేషకులు కోరుతున్నారు. దాని స్థానంలో పారదర్శకమైన కొనుగోళ్ల వ్యవస్థ ఏర్పాటు జరగాలంటున్నారు.
దిగుమతులపై ఆంక్షలు..
వంటనూనెలల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ఆంక్షలు విధించింది. మలేసియా ప్రధాని మహతీర్ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న భారత్.. ఆ దేశం నుంచి వచ్చే పామాయిల్ దిగుమతులకు అనుమతులు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇండోనేసియా నుంచి 10 డాలర్ల అధిక ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు భారత వ్యాపారులు.
దేశీయంగా సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడి తగ్గిపోవటం వల్ల వంటనూనెల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలోనే లీటరుపై రూ.20 పెరిగిందంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. అయితే ప్రభుత్వం ఇప్పటికే వంటనూనెల సాగును పెంచేందుకు కృషి చేస్తోంది. బడ్జెట్లో ఇందుకోసం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: