తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold ETF: చిన్న మొత్తంతోనూ బంగారు నిధి..

శుభకార్యమేదైనా.. అందులో పసిడికి భాగం ఉండాల్సిందే. ఇక వివాహం లాంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారం ఎంతో కీలకం. కొంతమంది పెట్టుబడి కోసమూ కొంటుంటారు. ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనడం సాధ్యం కాదనుకున్న వారు.. చిన్న మొత్తంతోనూ దీన్ని జమ చేసుకుంటూ వెళ్లొచ్చు. తక్కువ వ్యయంతో.. భద్రతకు ఇబ్బంది లేకుండా.. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనమైన గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై(Gold ETF) దృష్టి సారించవచ్చు.

Uses of Gold ETFs
గోల్డ్​ ఈటీఎఫ్​ ఉపయోగాలు

By

Published : Jul 9, 2021, 11:01 AM IST

బడ్జెట్‌లో పసిడిపై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించినప్పటి నుంచీ అది మరింత వెలుగుతోంది. అదే సమయంలో గోల్డ్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయమూ బులియన్‌ పరిశ్రమకు ఊతమిచ్చింది. గోల్డ్‌ స్పాట్‌ ఎక్స్ఛేంజీ వస్తే స్పాట్‌ ధరల విషయంలో పారదర్శకత లభిస్తుంది. ఒక ప్రామాణిక ధర అంటూ ఉంటుంది. ఇది పసిడి ఆధారిత పెట్టుబడులైన ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (ఈటీఎఫ్‌)లకు సానుకూలంగా మారనుంది.

సాధారణ పసిడిపై పెట్టే పెట్టుబడులతో పోలిస్తే బంగారం ధరల ఆధారంగా చలించే గోల్డ్‌ ఈటీఎఫ్‌లు తక్కువకే లభిస్తాయి. అదీకాక ఎలక్ట్రానిక్‌ రూపంలో కొనుగోలు చేయడం వల్ల నిల్వ, స్వచ్ఛత విషయంలో భద్రత బాధ ఉండదు.

ఇవీ ప్రయోజనాలు

గోల్డ్‌ ఈటీఎఫ్‌ అనేది స్టాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ను బంగారంతో జతచేసిన ఉత్పత్తిగా అభివర్ణించవచ్చు. ఎవరైనా సరే స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ మాదిరే గోల్డ్‌ ఈటీఎఫ్‌లను కూడా కొనుగోలు చేయొచ్చు, విక్రయించవచ్చు. అవి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉంటాయి. ట్రేడవుతూ ఉంటాయి. మార్కెట్‌ ధర వద్ద మన ఇష్టం వచ్చినపుడు కొనొచ్చు.. అమ్మొచ్చు. ఆభరణాలు, నాణేలు, కడ్డీలతో పోలిస్తే వీటిని అవసరమైనపుడు వెంటనే నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. ఎక్స్ఛేంజీల్లో రియల్‌ టైం ఎన్‌ఏవీ (నికర ఆస్తి విలువ) ఆధారంగా కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టవచ్చు. అంతే కాదు రుణాలకు హామీగానూ వీటిని ఉపయోగించుకోవచ్చు.

ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా..

పసిడిలో ఈ రూపంలో పెట్టుబడులు పెట్టడం వల్ల పన్ను ప్రయోజనాలనూ అందుకోవచ్చు. మూడేళ్ల పాటు గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టే పెట్టుబడులపై వచ్చే ఆదాయాన్ని కాస్ట్‌ ఇండెక్సేషన్‌ బెనిఫిట్‌తో దీర్ఘకాల మూలధన లాభాలుగా గుర్తించేందుకు అర్హత ఉంటుంది. అన్నిటికి మించి ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్లలో ఉండే ఊగిసలాటలకు దీనిని హెడ్జ్‌గా వినియోగించుకోవచ్చు. అంటే అక్కడ పెట్టే పెట్టుబడుల్లో కలిగే నష్టాలను పసిడిలో పెట్టే లాభాలతో పూడ్చుకోవచ్చన్నమాట. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాడుతున్న ఈ వేళ పసిడిపై అందరికీ ఆసక్తి పెరిగింది.

దీర్ఘకాలమైతేనే..

ఎవరైనా సరే భవిష్యత్‌ అవసరాల కోసం బంగారంలో పెట్టుబడులు పెట్టాలని భావించే వారు (పెళ్లిళ్ల వంటి వాటి కోసం) గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో 'సిప్‌' చేయవచ్చు. ఈ పద్ధతిలో పసిడిలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏళ్లు గడిచే కొద్దీ విలువను పెంచుకోవచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఎంత మేర గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు కేటాయించాలన్నదీ ఆర్థిక సలహాదారులను అడిగి తెలుసుకోవచ్చు. గత ఏడాది కాలంగా మాత్రం గోల్డ్‌ ఈటీఎఫ్‌లపై ఆసక్తి ఎక్కువగా కనబరుస్తున్నారు. గత ఏడాది కాలంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రికార్డు స్థాయిలో 120 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం.

ఒక మదుపరిగా మీరు ఒక బలమైన పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవాలన్నా.. లేదంటే పసిడి నిల్వలను పెంచుకోవాలని భావించినా.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్చు.

-చింతన్‌ హరియా, హెడ్‌- ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details