తెలంగాణ

telangana

ETV Bharat / business

మందగమనంలో 'వృద్ధి'.. మరి నేల విడిచి సాములెందుకు? - FDI

దేశంలో మాంద్యం దెబ్బకు వాహన, విద్యుత్‌, సహజవాయు, వ్యవసాయ, నిర్మాణ తదితర రంగాలు పడకేశాయి. ఈ స్థితిలో వృద్ధిరేటు క్షీణతపై కాగ్‌, ఆర్‌బీఐ, కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ) మొదలు ప్రపంచ బ్యాంకు వరకు ఎన్నో కీలక వ్యవస్థలు హెచ్చరికలు వెలుగు చూశాయి. అయితే, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పుడు పరిస్థితి తేటపడిందని, బడ్జెట్‌పై చర్చకు స్పందిస్తూ లోక్‌సభాముఖంగా సంతృప్తి వ్యక్తీకరించారు.

Analysis Story on growth rate slowing down and Govt. decisions to revive
మందగమనంలో వృద్ధిరేటు... మరి నేల విడిచి సాములెందుకు?

By

Published : Feb 13, 2020, 8:03 AM IST

Updated : Mar 1, 2020, 4:14 AM IST

రెండు నెలల క్రితం దేశంలో మాంద్యం ఉనికినే తోసిపుచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పుడు పరిస్థితి తేటపడిందని, బడ్జెట్‌పై చర్చకు స్పందిస్తూ లోక్‌సభాముఖంగా సంతృప్తి వ్యక్తీకరించారు. ఇటీవలి ఆర్థిక సర్వే వృద్ధి అంచనాల మోత బాణీని పుణికిపుచ్చుకొన్నట్లుగా- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) వృద్ధి సహా అన్నీ మంచి శకునాలేనని విత్తమంత్రి సంబరపడుతున్నారు. కొన్నాళ్లుగా వాహన, విద్యుత్‌, సహజవాయు, వ్యవసాయ, నిర్మాణ తదితర రంగాలు పడకేసిన స్థితిలో వృద్ధిరేటు క్షీణతపై కాగ్‌, ఆర్‌బీఐ, కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ) మొదలు ప్రపంచ బ్యాంకు వరకు ఎన్నో కీలక వ్యవస్థల హెచ్చరికలు వెలుగు చూశాయి. నాడు వాటిని పెడచెవిన పెట్టడంలో, ఆలస్యంగా చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఫలిస్తున్నట్లు నేడు ధీమా కనబరచడంలో విత్త మంత్రిత్వశాఖ సంయమనరాహిత్యమే ప్రస్ఫుటమవుతోంది. 2019 ఏప్రిల్‌, నవంబరు నెలల మధ్య ఎఫ్‌డీఐల ప్రవాహం 24.4 బిలియన్‌ డాలర్లతో (ఒక బిలియన్‌ డాలర్లు అంటే రూ.7,133 కోట్లు) పోలిస్తే, అంతకుముందు సంవత్సరం అదే కాలావధిలో వచ్చిన మొత్తం మూడు బిలియన్‌ డాలర్లకు పైగా తక్కువని మంత్రి గణాంకాలు ఉటంకించారు.

ఎనిమిదో స్థానంలో...

2019 సంవత్సరంలో అత్యధికంగా ఎఫ్‌డీఐలను ఆకర్షించిన తొలి పది దేశాల జాబితాను ఐక్యరాజ్య సమితి మూడు వారాల కిందట విడుదల చేసింది. అందులో అమెరికా, చైనా, సింగపూర్‌ మొదటి మూడు స్థానాలు సాధించగా- బ్రెజిల్‌, యూకే, హాంకాంగ్‌, ఫ్రాన్స్‌ వాటి వెన్నంటి నిలిచాయి. ఆ తరవాత ఎనిమిదో స్థానాన్ని భారత్‌ దక్కించుకుంది! 2019 ఏడాది మొత్తంలో ఇక్కడకు వచ్చిన ఎఫ్‌డీఐల రాశి అమెరికా రాబట్టినవాటిలో అయిదోవంతుకన్నా తక్కువ. ఇండియాతో పోలిస్తే చైనా మూడింతల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని పొందగలిగింది. మరింత మెరుగుదలే లక్ష్యంగా సకల శక్తియుక్తులూ కూడగట్టుకోవాల్సిన దశలో కేంద్ర ఆర్థిక శాఖ నేడిలా సంబరపడటమేమిటి?

ధీమా వల్ల తీవ్ర విఘాతం!

గత ఇరవై సంవత్సరాల గణాంకాలను పరికిస్తే- 2016 జనవరి, డిసెంబరు నెలల మధ్య దేశంలోకి గరిష్ఠ ఎఫ్‌డీఐల ప్రవాహానిదే రికార్డు. తరవాతి మూడేళ్లూ ఆ స్థాయిని తిరిగి అందుకోలేని అశక్తతను చెదరగొట్టేందుకు ఆరు నెలల క్రితం కొన్ని సంస్కరణలు ప్రకటించారు. బొగ్గు గనుల తవ్వకంలో, కాంట్రాక్ట్‌ తయారీ రంగంలో నూరుశాతం ఎఫ్‌డీఐలకు, ఏక బ్రాండ్‌ రిటైల్‌లో నిబంధనల సడలింపునకు మార్గం సుగమం అయిందప్పుడే. వచ్చే రెండు మూడేళ్లలో అవి ఏ మేరకు సత్ఫలితాలిస్తాయన్న ఉత్కంఠ సహజంగానే పెరుగుతోంది. భారీ అంచనాలతో రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లో ఎఫ్‌డీఐలకు దారులు ఏర్పరచినా ఈ అయిదేళ్లుగా అవి రాబట్టగలిగినవి దాదాపు రూ.18 వందల కోట్లు. అంచనాలు ఎక్కడ ఎందువల్ల దెబ్బతింటున్నాయో సమీక్షించుకుని ముందడుగేయాల్సిన తరుణంలో, అనవసర ధీమా వల్ల పొటమరించే అలసత్వం- దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు తీవ్ర విఘాతం వాటిల్లజేస్తుంది. 2018 కన్నా 2019లో బంగ్లాదేశ్‌లోకి ఎఫ్‌డీఐల ప్రవాహం ఆరుశాతం తగ్గింది. అటు పాకిస్థాన్‌లో 20 శాతం మేర కుంగుదల నమోదైంది. దక్షిణాసియా వరకు పరిశీలిస్తే, ఆ వ్యవధిలో భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో పెరుగుదల నమోదైనా- అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక శక్తిగా అవతరణకు, అందుకు అవసరమైన ఎనిమిది శాతం అంతకన్నా అధిక వృద్ధిరేటు సాధనకు... అది ఏ మూలకూ సరిపోదు. ఎఫ్‌డీఐలను అత్యధికంగా ఆకర్షించే తొలి మూడు దేశాల్లో ఒకటిగా స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు భారత్‌ ప్రణాళికాబద్ధంగా సమాయత్తం కావాలి. నైపుణ్యాలు, కార్మిక విపణి, ఆరోగ్యపద్దు తదితరాల్లో వెనకబాటుతనం ఇండియా ప్రగతిని కుంగదీస్తున్నదన్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) స్పష్టీకరణ- చికిత్స ఎక్కడ జరగాలో చెప్పకనే చెబుతోంది.

సవాళ్లెన్నో...

భారత్‌లో బంగారం లాంటి అవకాశాలున్నాయని, పెట్టుబడుల గమ్యస్థానం అదేనని నాలుగు నెలల క్రితం ‘బ్లూమ్‌బర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం’ (న్యూయార్క్‌) వేదిక నుంచి ప్రధాని మోదీ పిలుపిచ్చారు. ఏ దేశమేగినా ఇక్కడి వాణిజ్య సానుకూలాంశాల్ని ఆయన విధిగా ప్రస్తావిస్తున్నారు. వాస్తవిక కార్యాచరణకు సంబంధించి యంత్రాంగంలో దీటైన చొరవ కొరవడటమే ఎన్నో సమస్యలకు అంటుకడుతోంది. కొన్ని ప్రాథమిక అంశాల్ని ప్రభుత్వం స్పృశించినా ఇండియా ముంగిట సవాళ్లెన్నో నిలిచే ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) లోగడే తప్పుపట్టింది. సత్వర చికిత్స చురుగ్గా పట్టాలకు ఎక్కని పర్యవసానంగా మూడేళ్ల వ్యవధిలోనే అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌ ముప్ఫై స్థానాలు కిందకు జారిపోయింది. వాణిజ్య అనుకూలతల ప్రాతిపదికన ఇండియా 63వ ర్యాంకుకు ఎగబాకినా- కొన్ని ముఖ్యాంశాల్లో వెనకబాటుతనం నేటికీ పీడిస్తూనే ఉంది.

మౌలిక వసతుల లేమి!

న్యూజిలాండ్‌లో గంటల వ్యవధిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ముగిసి, ఒక్క పూటలో ఏదైనా వ్యాపారం ప్రారంభించగల వీలుంది. అదే ఇక్కడ- వాణిజ్య కార్యకలాపాలకు శ్రీకారం చుట్టడానికి 136 రోజులు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు 154 రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఫోర్బ్స్‌ నివేదిక గతంలో సూటిగా తప్పుపట్టిన- అవినీతి, విద్యుత్‌ పంపిణీ, రవాణా కడగండ్ల వంటివి ఇప్పటికీ స్థూలంగా అపరిష్కృత సమస్యలే. 2024-25నాటికి సుమారు రూ.100 లక్షల కోట్లతో సాకారం చేయదలచామన్న మౌలిక అజెండాకు వనరుల సమీకరణ అంశం ఇంకా ఒక కొలిక్కి రానేలేదు. సత్వర అనుమతులు, పారదర్శక నిబంధనావళితో పెట్టుబడిదారుల్ని సూదంటురాయిలా ఆకట్టుకోవడంలో సింగపూర్‌, హాంకాంగ్‌ వంటివి పోటీపడుతుండగా- లోతుగా వేళ్లూనుకున్న అవలక్షణాలతో భారత్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ అవ్యవస్థను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుంపనాశనం చేస్తేనే, భారత్‌కు వెలుపలి నుంచి పెట్టుబడులు బారులు తీరతాయి!

ఇదీ చూడండి:అధ్యక్షుడి రాక: ఒప్పందాలకు ట్రంప్‌ కార్డు పడేనా!

Last Updated : Mar 1, 2020, 4:14 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details