తెలంగాణ

telangana

ETV Bharat / business

డెట్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి! - పెట్టుబడులపై కరోనా ప్రభావం

కరోనా సంక్షోభంతో ఇటీవల మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు కుదేలయ్యాయి. దిగ్గజ సంస్థలు కూడా ఒత్తిడి కారణంగా డెట్​ ఫండ్లను రద్దు చేశాయి. మరి ఇప్పుడు డెట్​ పండ్లలో పెట్టుబడుల సంగతేంటి? ఇప్పటికే పెట్టుబడులు ఉన్నవారు, కొత్తగా పెట్టాలనుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అశంపై నిపుణుల సలహాలు సూచనలు మీ కోసం.

new plan for debt funds
డెట్​ ఫండ్లలో పెట్టుబడులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

By

Published : May 4, 2020, 8:05 AM IST

నష్టభయం తక్కువగా ఉండాలని కోరుకునే వారు.. స్వల్పకాలిక పెట్టుబడుల కోసం డెట్‌ ఫండ్లను పరిశీలిస్తుంటారు. ఇందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే.. కాస్త అధిక రాబడి రావడం.. దీర్ఘకాలిక పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు ఉండటం వల్ల చాలామంది వీటిని ఎంచుకుంటారు. తాజాగా ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ డెట్‌ విభాగంలోని ఆరు పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో డెట్‌ ఫండ్లలో మదుపు చేసే వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే డెట్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నవారూ.. పెట్టుబడి పెట్టే ఆలోచనతో ఉన్నవారూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

  • సాధారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల డెట్‌ ఫథకాలు.. ట్రెజరీ బిల్లులు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్లు, కమర్షియల్‌ పేపర్‌, బాండ్లు, డిబెంచర్లు మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. ఇందులో కొన్నింటికి నష్టభయం తక్కువగా ఉంటుంది. మరికొన్నింటికి అధికంగా ఉంటుంది. నష్టభయం లేని పథకాల్లో రాబడీ తక్కువే. అధిక నష్టభయం (క్రెడిట్‌ రిస్క్‌) ఉన్న వాటిలో మదుపు చేసే డెట్‌ ఫండ్లలో అధిక రాబడికి అవకాశం ఉంటుంది.
  • మనం ఎంచుకునే డెట్‌ ఫండ్లలో ప్రభుత్వాలకు, మంచి ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చే పెట్టుబడులు ఎక్కువగా ఉండాలి. ఆయా సంస్థల ఆర్థిక బలాలను పరిశీలనలోకి తీసుకుంటూ.. ఆ తర్వాత రేటింగ్‌ సంస్థలు ఇచ్చే రేటింగులనూ పరిగణనలోనికి తీసుకోవాలి. ఏఏఏ, ఏ1+, ఏఏ+, ఏఏ రేటింగ్‌ ఉన్నవి తక్కువ నష్టభయంతో ఉంటాయి. ఏఏ- లేదా అంతకు తక్కువ ఉన్న వాటిని అధిక నష్టభయంతో కూడిన పెట్టుబడులుగా చూస్తుంటారు.
  • బ్యాంకుల డిపాజిట్లు లేదా డెట్‌ ఫండ్ల ద్వారా మనం సంస్థలకు ఇచ్చే మొత్తాలు పలు నష్టభయాలకు లోబడే ఉంటాయి. ముఖ్యంగా డెట్‌ ఫండ్లు ఏ రూపంలో ఏయే సంస్థలకు పెట్టుబడులను సమకూరుస్తున్నాయి, ఆయా సంస్థల పనితీరు మొదలైనవి ఎలా ఉన్నాయి..
  • రాగల నష్టభయాలేమిటి?ఇలా పలు అంశాలను అధ్యయనం చేయాలి. దీని ఆధారంగానే పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. రేటింగ్‌ ఒక్కటే ప్రామాణికంగా చూడకూడదు. క్రెడిట్‌ రిస్క్‌, వడ్డీ రేట్లు, నగదు లభ్యత, నష్టభయంలాంటివీ కీలకమే.
  • డెట్‌ పథకాలు ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నదీ ముఖ్యమే.
  • మదుపరులు పెట్టుబడులు ఎప్పుడూ వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలి. స్థిరాస్తి, బంగారం, బ్యాంకు ఎఫ్‌డీలు, పోస్టాఫీసు పథకాలు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు మొదలైన వాటిల్లో మదుపు చేస్తూనే.. డెట్‌ ఫండ్లనూ ఎంచుకోవచ్చు. కాల వ్యవధి, నష్టాన్ని భరించే సామర్థ్యం, వ్యక్తిగత ఆర్థిక పరిస్థితిని బట్టి పెట్టుబడుల కేటాయింపు జరగాలి. వడ్డీ రేట్లు కొంతకాలంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సహజంగానే డెట్‌ ఫండ్లు (బాండ్లు) ఎక్కువ రాబడిని ఆర్జిస్తాయి. అయితే, ఇలాంటి అనిశ్చితిలో నష్టభయం ఎక్కువే అని గమనించాలి. డెట్‌ ఫండ్లలో మదుపు చేయాలనుకునే వారు.. తక్కువ నష్టభయం ఉండాలనుకుంటే.. గిల్ట్‌ ఫండ్లు, లిక్విడ్‌ ఫండ్లను పరిశీలించాలి. ఏయే ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెడుతున్నారన్నదాన్ని బట్టి, నష్టభయం ఆధారపడి ఉంటుందని గమనించాలి.
  • కేవలం అధిక రాబడి కోసమే చూడకుండా.. ఆయా పథకాల నాణ్యత, కాల వ్యవధి, నష్టభయం, అవసరమైనప్పుడు నగదు చేసుకునే సదుపాయం మొదలైన పలు అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ మరో విషయమూ పరిశీలించాలి. అన్ని క్రెడిట్‌ రిస్క్‌ విభాగంలోని పథకాల్లో నష్టభయం ఉంటుందని చెప్పలేం. అవి నాణ్యమైన రుణ పత్రాలైతే ఇబ్బందేమీ ఉండదు. తక్కువ రేటింగ్‌ ఉన్న పత్రాల్లో నష్టభయం అధికమే. ఆయా డెట్‌ పథకాలు నెలనెలా విడుదల చేసే ఫ్యాక్ట్‌ షీట్లను గమనించాలి. దీనివల్ల ఎక్కడెక్కడ మదుపు చేస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. దీన్నిబట్టి మన నిర్ణయాలను మార్చుకోవచ్చు. లేదా నిపుణులను సంప్రదించి, సలహా తీసుకోవాలి.

- జె.వేణుగోపాల్‌, సర్టిఫైడ్‌ ఫినాన్షియల్‌ ప్లానర్‌, జెన్‌ మనీ

ఇదీ చూడండి:కరోనా తర్వాత ఆన్​లైన్​లో కార్ల విక్రయాల జోరు!

ABOUT THE AUTHOR

...view details