తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా! - దివాలా

ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల చరిత్ర కలిగిన థామస్​కుక్ సంస్థ దివాలా తీసింది. సంక్షోభం నుంచి తేరుకునేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించక.. చివరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి థామస్​కుక్​ 2 బిలియన్​ పౌండ్ల అప్పుల్లో కూరుకుపోయింది.

థామస్​కుక్

By

Published : Sep 23, 2019, 4:04 PM IST

Updated : Oct 1, 2019, 5:05 PM IST

బ్రిటన్​కు చెందిన దిగ్గజ ట్రావెల్​ సంస్థ థామస్​కుక్ సోమవారం దివాలా తీసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అదనపు నిధులకోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించక.. 178 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ నేడు చేతులెత్తేసింది.

తీవ్ర ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న ఈ సంస్థ.. గట్టెక్కేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. నిధులకోసం ఇతర సంస్థలతో జరిపిన చర్చలు ఎలాంటి పురోగతిని సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో గత వారం దివాలాకు సంబంధించి చాప్టర్‌ 15 ప్రొసీడింగ్స్‌ను ఫైల్‌ చేసింది థామస్​కుక్​. ఫలితంగా దివాలా అంశం వెలుగులోకి వచ్చింది.

నేడు ఈ కేసు లండన్ హై కోర్టులో విచారణకు రానుంది.

నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థలు ఎక్కువ వాటా కోరడంవల్ల ఒప్పందం కుదరలేదని కంపెనీ సీఈఓ పీటర్‌ ఫాంక్‌ హాసర్‌ తెలిపారు.

ఫోసస్ టూరిజం గ్రూప్​తో చర్చలు..

చైనా పర్యాటక రంగ దిగ్గజమైన ఫోసన్‌ టూరిజం గ్రూపు... 1.1 బిలియన్‌ డాలర్లకు థామస్‌కుక్‌ పీఎల్‌సీ బెయిల్‌ ఔట్‌ కోసం చర్చలు జరిపింది. దీనికి బదులుగా కంపెనీ పర్యటక నిర్వహణ విభాగంపై పట్టు, విమానయాన సంస్థల్లో స్వల్ప వాటా కోరింది. కొత్త వాటాలు జారీ చేసి రుణాన్ని రద్దు చేసుకునేలా ప్లాన్‌ను సిద్ధం చేసింది. అయితే ఈ చర్చలు ఫలించలేదు. తొలుత 900 మిలియన్‌ పౌండ్లకు ఫోసన్‌ అంగీకరించింది. కానీ, అదనంగా మరో 200 మిలియన్‌ పౌండ్లను థామస్‌కుక్‌ కోరింది.
ఈ కంపెనీకి బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ ఇచ్చే అవకాశాలను బ్రిటన్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది.

178 ఏళ్ల చరిత్ర..

ఈ సంస్థను 1840లో విక్టోరియాకు చెందిన వ్యాపారవేత్త థామస్‌కుక్‌ ప్రారంభించారు. ఆయన తొలుత రైళ్లలో పర్యటక ప్యాకేజీలను నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బ్రిటన్‌లో మధ్యతరగతి శ్రేణి ప్రజలు వేగంగా అభివృద్ధి చెందడం కారణంగా వ్యాపారం విస్తరించింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్‌ జాతీయ రైల్వేతో కలిసి పనిచేసింది థామస్​కుక్​. 1970,80ల్లో ఇది కంపెనీకి మంచి ఊతాన్నిచ్చింది. ఆ తర్వాత 'డోంట్‌ జస్ట్‌ బుక్‌ ఇట్‌, థామస్‌ కుక్‌ ఇట్‌' అంటూ వచ్చిన వ్యాపార ప్రకటనతో కంపెనీ తీరే మారిపోయింది. ఈ కంపెనీ ఛార్టర్డ్‌ విమానాలు, ప్యాసింజర్‌ విమాన సర్వీసులు, హాలిడే ట్రిప్‌ ప్యాకేజీలు, హోటళ్లు, రిసార్టులు, క్రూయిజ్‌ లైన్స్‌ నిర్వహించడం మొదలుపెట్టింది.

నష్టాలకు కారణాలు ఇవేనా?

థామస్‌ కుక్‌ పీఎల్‌సీ యూరప్‌లో అతిపెద్ద పర్యటక రంగ సంస్థ. కానీ, దాదాపు దశాబ్ద కాలంగా యూరప్‌లో పర్యటక రంగం ఆశాజనకంగా లేదు. మరో పర్యటక రంగ దిగ్గజమైన జర్మనీకి చెందిన టీయూఐ ఏజీ పరిస్థితి కూడా ఇంతే. భారీగా ఆఫర్లు ప్రకటించినా యూరోపియన్లు ముందుకు రావడంలేదు. ఫలితంగా నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడైపోయాయి. గత ఏడాది కంపెనీకి ఉన్న 500 ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఒక్కో ఉద్యోగి కేవలం 188 పౌండ్ల ఆదాయాన్ని మాత్రమే సృష్టించినట్లు లెక్కలు చెబుతున్నాయి.

వాతావరణ మార్పులు కారణమే!

సాధారణంగా యూరప్‌ సూర్యకాంతి తక్కువ ఉండే ప్రదేశం కావడం వల్ల ఇక్కడి నుంచి పర్యటకులు వెచ్చదనం కోసం ఇతర ప్రాంతాలకు వెళుతుంటారు. కానీ, ఇటీవల కాలంలో యూరప్‌లో వేడిగాలులు పెరిగిపోయాయి. వారు అక్కడి నుంచి వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. దీనికి తోడు పలు విమానయాన సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటించడం, ఆన్‌లైన్‌ పంపిణీ నెట్‌వర్క్‌లు పెరగడం లాభాలను హరించివేసింది. భౌగోళిక రాజకీయాల్లో అశాంతి నెలకొనడం, బ్రెగ్జిట్‌, ఉగ్రదాడులు పెరిగిన ప్రభావం ఐరోపా పర్యటక రంగంపై పడింది. ఫలితంగా మార్చి 31నాటికి ఈ కంపెనీ 2 బిలియన్‌ పౌండ్ల అప్పుల్లో కూరుకుపోయింది.

యూకే చరిత్రలోనే అతిపెద్ద తరలింపులు..

థామస్‌ కుక్‌ దివాలాతో.. సంస్థకు చెందిన విమాన సర్వీసును నిలిపేసింది. థామస్​కుక్​కు చెందిన నాలుగు విమాన సంస్థలు మూతపడిన కారణంగా.. 16 దేశాల్లోని 21 వేల మంది ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారాయి.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో.. 1.50 లక్షల మంది థామస్ కుక్ కస్టమర్లు పర్యటనల్లో ఉన్నారు. ఇప్పుడు వీరిని స్వదేశాలకు తరలించే ప్రక్రియ.. శాంతి సమయంలో అత్యధిక మందిని స్వదేశానికి తెచ్చిన ఆపరేషన్‌గా మిగిలిపోనుందని ప్రభుత్వం పేర్కొంది.
దీంతో బ్రిటన్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ(సీఏఏ) విదేశాల్లో, యూకేలో ఉన్న కస్టమర్లకు ఫ్యూచర్‌ బుకింగ్స్‌లో సాయం చేస్తుందని థామస్‌ కుక్‌ పేర్కొంది. ఇప్పటికే సీఏఏ బ్రిటన్‌ వాసులను వెనక్కి తెచ్చేందుకు ఒక వైమానిక విభాగాన్ని సిద్ధం చేసింది. థామస్‌కుక్‌ పీఎల్‌సీ కస్టమర్ల కోసం సీఏఏ ఒక వెబ్‌సైటు ఏర్పాటు చేసింది.

'థామస్‌కుక్‌ ఇండియా'పై ప్రభావం లేదు..

బ్రిటన్‌లో థామస్‌కుక్‌ పీఎల్‌సీ దివాలా... భారత్‌లోని 'థామస్‌కుక్‌ ఇండియా'పై ప్రభావం చూపదని పేర్కొంది. 'బ్రిటన్‌లోని థామస్‌కుక్‌ పీఎల్‌సీ ప్రభావం భారత్‌లోని థామస్‌ కుక్‌ ఇండియాపై లేదు. ఇది పూర్తిగా భిన్నమైన సంస్థ' అని థామస్‌కుక్‌ ఇండియా వెల్లడించింది. 2012 ఆగస్టులో థామస్‌కుక్‌ భారతీయ విభాగం కార్యకలాపాలను భారత్‌కు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేసింది.

ఇదీ చూడండి: కార్పొరేట్​ పన్ను తగ్గింపు చారిత్రక నిర్ణయం: మోద

Last Updated : Oct 1, 2019, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details