తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 1:03 PM IST

ETV Bharat / business

ఎస్‌బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్‌... ఆర్​డీకి కొత్త వెర్షన్​

రికరింగ్​ డిపాజిట్(ఆర్​డీ)​ ఖాతాలో ప్రతి నెల కొంత స్థిర మొత్తంలో జమచేయాల్సి ఉంటుంది. ఇలా చెల్లించలేని తమ ఖాతాదారుల కోసం స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఫ్లెక్సీ డిపాజిట్​ ఖాతాను అందిస్తోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు. ఈ ఖాతా తెరిచే విధానం, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యవిషయాలు మీకోసం...

SBI Flexi Deposit Scheme
ఎస్‌బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్‌

దేశీయ‌ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. త‌మ‌ వినియోగ‌దారుల కోసం వివిధ ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను అందిస్తోంది. అందులో ఒక‌టి ఎస్​బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్‌. ఇది సాధార‌ణ రిక‌రింగ్ డిపాజిట్ మాదిరిగానే ప‌నిచేస్తుంది. అయితే రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాలో ప్ర‌తీ నెల కొంత స్థిర మొత్తంలో జ‌మ చేయాల్సి ఉంటుది. కానీ.. ప‌థ‌కంలో ఖాతాదారులు ప్ర‌తీనెల స్థిర మొత్తంలో వాయిదాల‌ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా, ఎన్ని సార్లైనా డిపాజిట్ చేయవచ్చు. ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడిదారులు కనీస, గరిష్ఠ పరిమితుల‌కు లోబ‌డి డిపాజిట్ మొత్తాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్​లైనలో ఈ ఫ్లెక్సీ డిపాజిట్ ఖాతాను తెరిచే సదుపాయాన్ని కల్పిస్తోంది ఎస్​బీఐ.

పథకం గురించి 5 ముఖ్య విషయాలు:

  • ఎస్​బీఐ వెబ్​సైట్ ప్రకారం.. ఈ ప‌థ‌కంలో ఒక‌సారి క‌నీసం రూ. 500 మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.500 గుణిజాల‌లో ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.5 వేల‌ వ‌ర‌కు జ‌మ చేయాల్సి ఉంటుంది. ఏడాదిలో గ‌రిష్ఠంగా రూ.50 వేల వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.
  • డిపాజిట్ చేయాల్సిన కాల పరిమితి కనిష్ఠంగా 5 సంవత్సరాలు కాగా.. గరిష్ఠంగా 7 సంవత్సరాలు.
  • ఒక సంవత్స‌రం, ఏడు సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ఎస్​బీఐ ప్ర‌స్తుతం 6.25 శాతం వ‌డ్డీని అందిస్తుంది. ఎస్​బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్‌పై కూడా 6.25 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ట‌ర్మ్ డిపాజిట్ల మాదిరిగానే, ఎస్​బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్‌పై కూడా సీనియ‌ర్ సిటిజ‌న్లకు అద‌న‌పు వ‌డ్డీరేటును అందిస్తుంది. ఈ డిపాజిట్లపై వారు 6.75 శాతం నుంచి 6.90 శాతం వరకు వడ్డీని పొందే వీలుంది.
  • కాల‌వ్య‌వ‌ధి కంటే ముందుగానే ఈ ప‌థ‌కం నుంచి డిపాజిట్ల‌ను విత్‌డ్రా చేసుకునే సౌక‌ర్యం ఉంది రూ.5 ల‌క్ష‌ల డిపాజిట్ల‌ను కాల‌వ్య‌వ‌ధి కంటే ముందుగానే విత్‌డ్రా చేసుకుంటే 0.50 శాతం(అన్ని కాల‌వ్య‌వ‌ధుల‌కు) అప‌రాధ రుసుము విధిస్తారు. రూ.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్ల‌పై 1 శాతం అప‌రాధ రుసుము వ‌ర్తిస్తుంది.
  • ఆదాయ‌పు ప‌న్ను శాఖ నియ‌మాల ప్ర‌కారం ప‌న్ను(టీడీఎస్‌) వ‌ర్త‌ిస్తుంది. ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు డిపాజిట్ చేసిన వ్య‌క్తి ఫారం 15జీ/హెచ్​ను ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:ఎస్​బీఐ వినియోగదారులకు శుభవార్త.. వడ్డీ రేట్ల తగ్గింపు

ABOUT THE AUTHOR

...view details