ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది.
2019 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.11,640 కోట్ల ఏకీకృత నికర లాభం గడించినట్లు రిలయన్స్ ప్రకటించింది. 2018 అదే సమయంలో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.10,251 కోట్లుగా ఉండటం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రిలయన్స్ నికర లాభం 13.5 శాతం పెరిగింది. సంస్థ ఆదాయం 1.4 శాతం మేర తగ్గి..రూ. 168,858 కోట్లకు చేరింది.
జియో ధన్ ధనాధన్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన టెలికాం విభాగం జియో.. 2019-20 క్యూ3లో భారీ లాభాలు ఆర్జించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,350 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభం ప్రకటించింది జియో. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 831 కోట్లుగా ఉంది.
2019 అక్టోబర్-డిసెంబర్ కాలంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 28.3 శాతం పెరిగి రూ.13,968 కోట్లుగా నమోదైనట్లు జియో ప్రకటించింది. 2018 ఇదే సమయంలో సంస్థ ఆదాయం రూ.10,884 కోట్లుగా ఉంది.
2019 డిసెంబర్ 31 నాటికి జియో ఖాతాదారుల సంఖ్య.. 2018 ఇదే సమయంతో పోలిస్తే 32.1 శాతం పెరిగి 37 కోట్లకు చేరినట్లు జియో వెల్లడించింది. 2019-20 మూడో త్రైమాసికంలో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.128.4గా ఉన్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:లక్ష కోట్ల డాలర్లకు 'ఆల్ఫాబెట్' మార్కెట్ విలువ