తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటో రంగానికి కలిసొచ్చిన పండుగ సీజన్​ - automobile news india

పండుగల సీజన్​ దేశీయ ఆటోమొబైల్​ రంగానికి కలిసొచ్చింది. వరుసగా 7 నెలల క్షీణత అనంతరం అక్టోబర్​లో మారుతీ సుజూకీ 4.5 శాతం వృద్ధి సాధించింది. వినియోగదారుల నుంచి డిమాండ్​ పెరగటం వల్ల మహీంద్రా, టొయోటా కిర్లోస్కర్​ మోటర్స్​ మెరుగైన పనితీరు కనబరిచాయి.

ఆటో రంగానికి కలిసొచ్చిన పండుగ సీజన్​

By

Published : Nov 1, 2019, 5:48 PM IST

పండుగ సీజన్​ అయిన అక్టోబర్​లో దేశీయ ఆటోమొబైల్​ రంగానికి స్వల్ప ఊరట లభించింది. మారుతీ సుజుకీ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టొయోటా కిర్లోస్కర్​ మోటర్స్​ గతంలో కంటే మెరుగైన పనితీరును కనబరిచినట్లు ప్రకటించాయి.

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్​ఐ) అక్టోబర్​ నెలలో 4.5 సాతం మేర వృద్ధి సాధించింది. 2018 అక్టోబర్​లో 1,38,100 కార్లు అమ్ముడవగా.. గత నెలలో 1,44,277 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. గడిచిన 7 నెలల కాలంలో తొలిసారి దేశీయ అమ్మకాల్లో వృద్ధి నమోదు చేసింది.

ఎం అండ్​ ఎం..

మందగమన భయాలు ఉన్నప్పటికీ.. మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ మెరుగైన పనితీరు కనబరిచింది. 2018 అక్టోబర్​తో పోల్చితే విక్రయాల్లో 11 శాతం మేర క్షీణత నమోదైంది. కానీ సెప్టెంబర్​తో పోల్చితే సుమారు 10 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. 2018 అక్టోబర్​లో 55,350 యూనిట్లు అమ్ముడవగా.. ఈ ఏడాది 49,193 యూనిట్లుగా ఉంది. సెప్టెంబర్​లో 21 శాతం క్షీణతతో 40,692 యూనిట్లు విక్రయించింది సంస్థ.

టొయోటా..

టొయోటా కిర్లోస్కర్​ మోటర్స్ విక్రయాల్లో​ గతేడాదితో పోల్చితే 6 శాతం క్షీణత నమోదయింది. కానీ సెప్టెంబర్​ నెలతో పోల్చితే మంచి పనితీరు కనబరిచింది. 2018, అక్టోబర్​లో 12,606 యూనిట్లు విక్రయించగా.. ఈ ఏడాది అక్టోబర్​లో 11,866 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్​లో 10,203 యూనిట్లు అమ్ముడయ్యాయి.
భారత మార్కెట్లోకి ఇటీవలే ప్రవేశించిన ఎంజీ మోటర్స్ ఇండియా అక్టోబర్​లో తన ఎస్​యూవీ హెక్టార్​ కార్లు 3.536 యూనిట్లు విక్రయించింది.

ద్విచక్రవాహనాలు..

ద్విచక్ర వాహన రంగంలో బజాజ్​ ఆటో దేశీయ అమ్మకాల్లో 13 శాతం క్షీణత నమోదు చేసింది. 2018లో అక్టోబర్​లో 3,19,942 యూనిట్లు విక్రయించగా.. ఈ ఏడాది 2,78,776 యూనిట్లుగా ఉంది.

టీవీఎస్​ మోటర్స్​ సంస్థ గతేడాదితో పోల్చితే అక్టోబర్​లో 25.45 శాతం మేర క్షీణించి 2,52,684 యూనిట్లు విక్రయించింది. 2018 అక్టోబర్​లో ఈ సంఖ్య 3,38,988 యూనిట్లుగా ఉంది.

వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్​ లే​లాండ్​ గతేడాదితో పోల్చితే ఈ అక్టోబర్​లో 37 శాతం క్షీణించి 9,074 యూనిట్లు విక్రయించింది. 2018లో ఈ సంఖ్య 14,341 యూనిట్లుగా ఉంది.

ఇదీ చూడండి:అక్టోబర్​లోనూ నిరాశపరిచిన జీఎస్టీ వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details