సంచలనాల దిగ్గజం జియో మరోసారి వార్తల్లో నిలిచింది. గతేడాది నవంబర్లో అత్యధిక మంది యూజర్లను పొంది... అతిపెద్ద టెలికాం సంస్థగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్'... దేశంలోని టెలికాం సంస్థల వినియోగదారుల గణాంకాలు ప్రకటించింది. 2019 నవంబర్ నాటికి జియోకు దేశవ్యాప్తంగా 36.9 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు వెల్లడించింది.
రెండో స్థానంలో వొడా-ఐడియా..
33.62 కోట్ల మంది వినియోగదారులతో వొడాఫోన్-ఐడియా రెండో స్థానంలో నిలిచింది. 32.73 కోట్ల మంది వినియోగదారులతో భారతీ ఎయిర్టెల్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
క్షీణత..
2019 నవంబర్లో మొత్తం టెలిఫోన్ వినియోగదారులు 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరారు. 2019 అక్టోబర్లో ఈ సంఖ్య 120.48 కోట్లుగా ఉంది. మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల సంఖ్య అత్యధికంగా 2.43 శాతం తగ్గి 115.43గా నమోదైంది. అక్టోబర్లో 118.34 కోట్లుగా ఉంది. నవంబర్లో వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 3.6 శాతం మంది వినియోగదారులను కోల్పోగా.. రిలయన్స్ జియోకు అత్యధికంగా 56 లక్షల మంది చేరారు. ఎయిర్టెల్ 16.59 లక్షల మంది వినియోగదారులను సాధించగలిగింది. ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ 3.41 లక్షల మొబైల్ వినియోగదారులను పొందింది.