తెలంగాణ

telangana

ఇన్ఫోసిస్​కు ఏమైంది..? ఎందుకీ నష్టాలు...?

By

Published : Oct 22, 2019, 1:17 PM IST

Updated : Oct 22, 2019, 2:16 PM IST

ఇన్ఫోసిస్ సీఈఓ, సీఎఫ్ఓపై అవినీతి ఆరోపణలు ఆ సంస్థ షేర్లకు భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఇద్దరు ఉన్నతాధికారులు తప్పుడు మార్గాల్లో లాభాలు ఆర్జిస్తున్నారంటూ సంస్థ బోర్డుకు ఓ గుర్తుతెలియని ఉద్యోగుల బృందం ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై స్వతంత్ర విచారణకు ఆదేశించినట్లు ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని వెల్లడించారు.

ఇన్ఫోసిస్​

ఇన్ఫోసిస్​కు ఏమైంది..? ఎందుకీ నష్టాలు...?

అవినీతి ఆరోపణలతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ షేర్లు ఒక్క సారిగా కుప్పకూలాయి. ఆ సంస్థ ప్రధాన అధికారులు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలతో బీఎస్​ఈలో సంస్థ షేరు విలువ ప్రస్తుతం 14.60 శాతం నష్టంతో.. రూ.659.65 వద్ద కొనసాగుతోంది.

ఆరోపణలేంటంటే...

ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్​ పరేఖ్​, సీఎఫ్​ఓ నీలాంజన్ రాయ్​లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ.. ఉద్యోగులుగా చెప్పుకుంటున్న ఓ గుర్తుతెలియని బృందం తీవ్ర ఆరోపణలు చేసింది. వారిద్దరు స్పల్పకాలంతో అధిక లాభాలు ఆర్జించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని పెర్కొంది. దీనిపై అమెరికా మార్కెట్ల నియంత్రణ సంస్థకు లేఖ రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ కారణంగా ఇటు దేశీయ మార్కెట్లలోనూ.. అటు అమెరికా మార్కెట్లలోనూ ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2013 తర్వాత సంస్థ షేర్లు ఈ స్థాయిలో కుప్పకూలడం ఇదే ప్రథమం.

స్పందించిన నందన్ నీలేకని..

అవినీతి ఆరోపణలపై ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని స్పందించారు. ఈ విషయంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. షార్దుల్ అమర్​చంద్​ మంగల్దాస్ న్యాయ సంస్థ, ఇన్ఫోసిస్ ఆడిట్ కమిటీ ఎర్నెస్ట్ అండ్ యంగ్​ నేతృత్వంలో విచారణ జరగనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించారు.

సంస్థ బోర్డు సభ్యులు రెండు ఫిర్యాదులను అందుకున్నారని నీలేకని వెల్లడించారు. సెప్టెంబర్ 20న, 30న ప్రజావేగు పేరుతో ఆ ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉన్నతాధికారులు ఈ నెల 10 బోర్డు ఆడిట్ కమిటీ, నాన్-ఎగ్జిక్యూటివ్​ సభ్యుల ముందు హాజరైన విషయాలన్నీ వెల్లడించారు నీలేకని.

ఇదీ చూడండి: 'భారత్​లో ఆర్థిక సంక్షోభానికి అవే కారణం'

Last Updated : Oct 22, 2019, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details