సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ను వరుస కష్టాలు వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఓ వైపు గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్లు సీఈఓ సుందర్‌పిచాయ్ నేతృత్వంలో ప్రపంచవ్యాప్త కార్యకలాపాల్లో దూసుకుపోతుంటే.. అంతర్గత వ్యవహారాల్లో మాత్రం గత కొంతకాలంగా లుకలుకలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ గూగుల్ మానవ వనరుల శాఖ (హెచ్ఆర్) ఉపాధ్యక్ష పదవికి ఎలీన్ నౌటన్ రాజీనామా. ఆమె రాజీనామా విషయాన్ని గూగుల్ సోమవారం అధికారికంగా వెల్లడించింది.
"గూగుల్‌లో ఎలీన్ అందించిన సేవలకు కృతజ్ఞతతో ఉన్నాం." అని గూగుల్, మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్‌పిచాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎలీన్ గూగుల్‌లో పని చేసిన కాలంలో దాదాపు 70,000 మంది ఉద్యోగులను చేర్చుకున్నారు.
"నా భర్త, నేను మొదట లండన్‌లో, ఇప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలో ఆరు సంవత్సరాలు ఉన్నాం. ఇప్పుడు ఇక కుటుంబానికి దగ్గరగా న్యూయార్క్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం" అని నౌటన్ చెప్పడం గమనార్హం. అయితే గూగుల్‌ను వీడినా.. తన స్థానాన్ని భర్తీ చేసే అధికారిని నియమించేందుకు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్, సీఎఫ్ఓ రుత్ పోర్ట్‌లకు సహకరిస్తానని స్పష్టం చేశారు ఎలీన్.
లాభాల నిరాశ..
గత ఏడాది చివరి త్రైమాసిక ఫలితాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు రాబట్టలేకపోయింది గూగుల్. ఇప్పుడు కీలక పదవి నుంచి నౌటన్ తప్పుకోవడం వల్ల పిచాయ్ ముందుకు మరో కొత్త సవాలు వచ్చినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గూగుల్ వరుస సవాళ్లు..
గత కొంత కాలంగా గూగుల్ అంతర్గత వ్యవహారాల్లో పలు అంశాలు చర్చకు దారితీశాయి. అందులో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో తీసుకున్న నిర్ణయాలను సంస్థ ఉద్యోగులే వ్యతిరేకించడం వంటి అంశాలు ఉన్నాయి.