ప్రపంచ వ్యాప్తంగా 2020లో మరో 2.5 మిలియన్ల మంది నిరుద్యోగులుగా మారే అవకాశమున్నట్లు ఐక్యరాజ్య సమితి(ఐరాస) కార్మిక సంస్థ నివేదిక తెలిపింది. కోరుకున్న వేతనాలు వచ్చే ఉపాధి లభించకపోవడం కారణంగా.. దాదాపు 50 కోట్ల మంది తక్కువ వేతనాలకే పని చేయొచ్చని పేర్కొంది.
ఉద్యోగాల సృష్టిలో క్షీణత..
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) విడుదల చేసిన ప్రపంచ ఉద్యోగ కల్పన, సామాజిక ముఖచిత్రం (డబ్ల్యూఎస్ఓ) నివేదిక ప్రకారం.. గత తొమ్మిదేళ్లుగా ఉద్యోగకల్పన కాస్త అటు ఇటుగా స్థిరంగానే ఉంది. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన శ్రామిక శక్తికి.. అవరసరమైన ఉద్యోగాల సృష్టి జరగటం లేదని నివేదిక అభిప్రాయపడింది.
ఉద్యోగ కల్పన క్షీణించడం కారణంగా మిలియన్ల మందికి ఉపాధి ద్వారా లభించే.. సరైన జీవన విధానాన్ని కల్పించడం కష్టతరమవుతుందని ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గాయ్ రేడర్ తెలిపారు.