రాజకీయ నాయకుల వరుస ప్రయాణాలతో మార్చి-ఏప్రిల్లో దేశీయ విమాన రంగం భారీగా పుంజుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారం కోసం అత్యధికంగా చార్టర్ ఫ్లైట్లను అద్దెకు తీసుకుని ప్రయాణాలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజా గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో చార్టర్ విమాన ప్రయాణాల సంఖ్య 11.2 శాతం వృద్ధి నమోదుచేసింది. మొత్తం విమాన ప్రయాణాల సంఖ్య 2018లో మార్చిలో 24,229. ఈ ఏడాది మార్చిలో 26,964 విమాన ప్రయాణాలు నమోదయ్యాయి. ఫలితంగా గడచిన ఆరునెలలతో పోలిస్తే ఈ రెండు నెలల్లో భారీగా లాభాలను నమోదు చేశాయి విమానయాన సంస్థలు.
"మార్చి-ఏప్రిల్ నెలల్లో మా విమానాలన్నీ వినియోగించాం. నిజం చెప్పాలంటే గత కొన్ని సంవత్సరాల్లోనే ఈ రెండు నెలలు మంచి లాభాలను తెచ్చాయి. ఇది ముందుగా అంచనా వేసిన విషయమే. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి విమానాల అవసరం అధికంగా ఉంటుంది. ఈ రెండు నెలల్లో అన్ని చార్టర్ విమాన సంస్థల ఎయిర్ క్రాఫ్ట్లు నిరంతరాయంగా పని చేశాయి. సాధారణ సమయాల్లో వీటి వినియోగం 80 శాతంగా ఉంటుంది."
-రాజన్ మెహ్రా, క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ