తెలంగాణ

telangana

ETV Bharat / business

రివ్యూ 2019: ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు పరుగో పరుగు

2019 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది జరిగిన మార్పుల్లో స్టాక్ మార్కెట్ల గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ఏడాది మార్కెట్లో సంభవించిన కీలక ఘట్టాలు.. ఆటపోట్లను ఒక్క సారి గుర్తుచేసుకుందాం.

STOOCKS THIS YEAR
స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది

By

Published : Dec 29, 2019, 5:00 PM IST

Updated : Dec 31, 2019, 7:10 AM IST

అంతర్జాతీయంగా అమెరికా- చైనా వాణిజ్య యుద్ధం, ఆర్థిక మాంద్యం వంటి ఎన్నో అవరోధాలు ఉన్నా.. దేశీయ స్టాక్​ మార్కెట్లు ఈ ఏడాది సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ఇటీవల వాణిజ్య యుద్ధానికి తెరపడినా.. ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కొన్ని సందర్భాల్లో సూచీలు ఆందోళనకర సంకేతాలిచ్చినా.. పడి లేచిన కెరటాల్లా మళ్లీ లాభాల్లో కొనసాగాయి. ముఖ్యంగా ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి మోదీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా రాజకీయ పరంగా సుస్థిరత ఏర్పడింది. ఫలితంగా ఆటుపోట్లు ఉన్నా మార్కెట్లు ముందుకే పయనించాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్రం ఉద్దీపనలు ప్రకటించడమూ మార్కెట్లకు కలిసొచ్చింది.

ఈ ఏడాదిలో సూచీలు సాగాయిలా..

36,254.57 పాయింట్లతో ఏడాది తొలి సెషన్​ను ప్రారభించిన సెన్సెక్స్​.. ప్రస్తుతం 40,575.14 పాయింట్ల వద్ద ఉంది (డిసెంబర్ 27 నాటికి). ఈ లెక్కన ఇప్పటి వరకు సెన్సెక్స్ 4,320.57 పాయింట్లు పెరిగింది.

నిఫ్టీ ఈ ఏడాది తొలి సెషన్​ 10,910.10 వద్ద ప్రారంభించింది.. ప్రస్తుతం ఈ సూచీ 12,145.80 వద్ద ఉంది (డిసెంబర్ 27 నాటికి). ఇప్పటి వరకు నిఫ్టీ మొత్తం 1,235.7 పాయింట్లు బలపడింది.

కీలక స్థాయిలు ఇవే..

ఈ ఏడాదిలోనే సెన్సెక్స్ 39,000, 40,000, 41,000 మార్క్​ల​ను దాటింది. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపాకు స్పష్టమైన మెజారిటీ వస్తున్నట్లు తెలియడం వల్ల తొలిసారి మే 23న సెన్సెక్స్ 40,000 మార్క్​ను తాకింది. నిఫ్టీ 12,000 మార్క్​ను తాకింది. మోదీ 2.0 ప్రభుత్వం రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కారణంగా కొన్ని రోజులు ఆ సానుకూలతలు కొనసాగాయి.

ఈ ఏడాది మొత్తం మీద ఇంట్రాడేలో.. సెన్సెక్స్ సెప్టెంబర్ 20న 2163 పాయింట్లకు పైగా లాభాన్ని గడించింది. నిఫ్టీ 655 పాయింట్లకు పైగా లాభాన్ని నమోదు చేసింది. కార్పొరేట్​ పన్ను 10 శాతం మేర తగ్గిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవడం ఇందుకు కారణం. ఇదే రోజు బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల్లో మదుపరుల సంపద రూ.7 లక్షల కోట్లు పెరిగింది.

నష్టాల పరంగా చూస్తే సెన్సెక్స్ బడ్జెట్​ మరుసటి రోజు జులై 8న 793 పాయింట్లు, జీడీపీ రేటు తగ్గుదల ఆందోళనలతో సెప్టెంబర్​ 3న 770 పాయింట్లు క్షీణించింది. సెప్టెంబర్​ 3న నిఫ్టీ 225 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ఈ షేర్లు భళా..

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఎం-క్యాప్​ ఈ ఏడాదే రూ.10 లక్షల కోట్ల మార్క్​ను దాటింది. ఈ కారణంగా దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.

ఈ రేసులో టీసీఎస్​ కాస్త వెనుకంజలో ఉండి.. రూ.8 లక్షల కోట్లకు పైగా ఎం-క్యాప్​తో రెండో స్థానంలో నిలిచింది.

ఇటీవలే ప్రైవేట్ రంగ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ రూ.7 లక్షల కోట్ల ఎం-క్యాప్​ను సాధించింది. ఈ మార్క్​ను అందుకున్న మూడో భారత సంస్థగా నిలిచింది. బ్యాంకింగ్ రంగంలో రూ.7 లక్షల కోట్ల మార్కెట్​ క్యాపిటల్​ను అందుకున్న తొలి భారతీయ బ్యాంకు ఇదే కావడం విశేషం.

మొత్తం మీద ఈ ఏడాది బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు భారీగా వృద్ధి చెందాయి.

ఈ షేర్లు డీలా..

జెట్ ఎయిర్​వేస్​ షేర్లు ఈ ఏడాది భారీగా పతనమయ్యాయి. ఈ షేర్లు ఇప్పటి వరకు 90 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం ఈ సంస్థను విక్రయించే పనుల్లో ఉన్నారు రుణదాతలు. జెట్​ ఎయిర్​ సహా పలు మధ్య చిన్న తరహా షేర్లూ ఈ ఏడాది మదుపరులకు అంతగా లాభాలు సృష్టించలేకపోయాయి.

మొత్తం మీద ఎస్​ బ్యాంకు, హెచ్​సీఎల్​టెక్​, ఇండియా బుల్స్​ హౌసింగ్​, జీ ఎంటర్​టైన్​మెంట్​ షేర్లు ఈ ఏడాది భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:కొత్త సంవత్సరంలో తగ్గనున్న కూరగాయల ధరలు!

Last Updated : Dec 31, 2019, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details