'కరోనా వైరస్ వ్యాప్తి అనంతరం నిత్యావసరాల్లోనూ నాణ్యతకు ప్రాధాన్యం పెరుగుతోంది. శుభ్రమైన పద్ధతిలో ప్రాసెస్ చేసిన వాటి కోసం వినియోగదారులు చూస్తున్నారు. ఇందువల్ల విడి ఉత్పత్తుల నుంచి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఉత్పత్తులకు గిరాకీ అధికమవుతోంది. ఇందుకనుగుణంగా భిన్న ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తాం' అని ఐటీసీ వ్యవసాయ వ్యాపార విభాగాధిపతి ఎస్.శివకుమార్ చెప్పారు. లాక్‌డౌన్ నిబంధనల్లో అత్యవసరాలతో పాటు మరిన్ని ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం అనుమతులిచ్చినా, కార్మికుల లభ్యత, ముడిసరకు సమీకరణ, సరఫరాలే ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నాయని 'ఈనాడు' ఇంటర్వ్యూలో వివరించారు.
ముఖ్యాంశాలివీ..
కరోనా వైరస్ లాక్‌డౌన్ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నారు?
లాక్‌డౌన్ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నింటికీ అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కారం, గోధుమపిండి, బిస్కెట్లు-నూడిల్స్ తయారీ వంటి సంస్థలకు అనుమతులు మొదటినుంచీ ఉన్నాయి. ఇప్పుడు పళ్లరసాలు, చిప్స్ వంటి వాటి తయారీకీ అనుమతిస్తున్నారు. దేశం మొత్తంమీద ఐటీసీకి 85 వరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుంటే, ఇందులో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో 7-8 ఉన్నాయి. మిరప, పసుపు వంటి స్పైసెస్‌తో పాటు బిస్కెట్ తయారీ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. గ్రీన్‌జోన్‌లలో ఇబ్బంది లేకున్నా, కంటెయిన్‌మెంట్ జోన్‌ల పరిధిలో కష్టంగా ఉంటోంది. ముఖ్యంగా కార్మికులు ఇళ్లకు వెళ్లిపోవడం సమస్యగా మారింది. ముడిపదార్థాల సమీకరణ కూడా కొంత కష్టంగా ఉంది.
ముడి పదార్థాల కోసం మీకు రైతులతో ఒప్పందాలున్నాయి కదా?
వరి, గోధుమలు, నూనెగింజల సమీకరణ ఇప్పుడు చేస్తున్నాం. మాకు రైతులతో ఒప్పందాలుండి, సరకు నేరుగా కొనుగోలు చేసిన ప్రాంతాల్లో ఇబ్బందులేమీ లేవు. కానీ మార్కెటింగ్ యార్డులలో కొనుగోలు చేయాల్సిన చోట మాత్రం ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొన్నిచోట యార్డులు మూసే ఉన్నాయి. ఉదాహరణకు గోధుమపిండి కోసం మధ్యప్రదేశ్‌లో గోధుమలు సమీకరిస్తాం. రెడ్‌జోన్ వల్ల అక్కడ యార్డులు మూసిఉన్నాయి. అదే మార్కెట్‌యార్డులు గ్రీన్‌జోన్లలో ఉన్నచోట ఇబ్బంది లేదు. బంగాళాదుంపల సమీకరణకు ఇబ్బందులు తొలిగాయి. కార్మికుల లభ్యత, నగరాల్లో అంతర్గత వాహనాల రవాణా మాత్రం కష్టంగానే ఉంది. రైతులతో మెరుగైన పద్ధతుల్లో సాగు చేయించేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఇ-చౌపాల్ 4.0 వంటి మొబైల్ సాంకేతికతలు ఇచ్చి కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని మిరప రైతులకు మడతపెట్టే వీలున్న చిల్లీడ్రైయర్లు అందించి, కూలీలు దూరంగా ఉంటూనే పనిచేసేలా సహకరించాం. ఇందువల్ల 30 శాతం సమయం ఆదా అయ్యిందని అంచనా.