యాపిల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) టిమ్ కుక్ వార్షిక వేతనం భారీగా తగ్గింది. 2019కి గానూ ఆయన 11.6 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నట్లు తెలిసింది. గతేడాది యాపిల్ బలహీన ప్రదర్శన కనబర్చడమే ఇందుకు కారణంగా సంస్థ విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది.
టిమ్ కుక్ అంతకు ముందు 2018లో 15.7 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు. అందులో 3 మిలియన్ డాలర్లు బేసిక్ సాలరీగా ఉంది. వివిధ బోనస్‌లు, పారితోషికాల కింద మిగతా మొత్తాన్ని పొందారు.
సంస్థ ప్రదర్శనపైన ఆధారపడి ఉండే బోనస్‌లు ఇతర పారితోషికాలు 2019లో 7.7 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యాపిల్ నిర్దేశించుకున్న అమ్మకాల లక్ష్యంలో 28 శాతం మాత్రమే అధిగమించగలిగింది. ఈ కారణంగానే సీఈఓ వేతనం తగ్గింది. ఇదే 2018లో చూస్తే.. కంపెనీ లక్ష్యాలు 100 శాతం చేరుకున్న కారణంగా 12 మిలియన్ డాలర్ల బోనస్‌లు, పారితోషికాలు పొందినట్లు ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు దాఖలు చేసిన ఫైలింగ్‌లో యాపిల్ పేర్కొంది.