మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరక్టర్ జగదీశ్ ఖట్టర్‌ను కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అదుపులోకి తీసుకుంది. తన సొంత కంపెనీ కోసం తీసుకున్న రణంలో రూ.110 కోట్ల మేర నిధుల దారి మళ్లింపు ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది.
ఖట్టర్ సొంత కంపెనీ 'కార్‌నేషన్' ఆటో ఇండియా లిమిటెడ్‌లు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (పీఎన్‌బీ) రూ.110 కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగించినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఖట్టర్ ఇంట్లో, కార్‌నేషన్ ఆటో కార్యాలయాల్లో ఇటీవల సోదాలు జరిపింది సీబీఐ.
మారుతీ నుంచి కార్‌నేషన్ ఆటో వరకు..
1993 నుంచి 2007 వరకు మారుతీ ఉద్యోగ్‌లో పని చేసిన ఖట్టర్.. ఆ సంస్థ నుంచి ఎండీగా పదవీ విరమణ చేశారు. అనంతరం కార్‌నేషన్‌ను స్థాపించి దానికోసం.. 2009లో పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.170 కోట్ల రుణాన్ని పొందారు. ఈ రుణం 2012 నుంచి నిరర్ధక ఆస్థిగా ఉన్నట్టు.. 2015లో ప్రకటించినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.