కరోనా మహమ్మారి విమానయాన రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో బ్రిటన్కు చెందిన బ్రిటిష్ ఎయిర్వేస్ చేరింది. కరోనాతో సంక్షోభం కారణంగా 12 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడొచ్చని బ్రిటిష్ ఎయిర్వేస్ మాతృ సంస్థ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ గ్రూప్ (ఐఏజీ) ప్రకటించింది.
సంక్షోభం తర్వాత సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించినా.. ప్రయాణికుల డిమాండ్ సాధారణ స్థితికి చేరుకునేందుకు కొన్ని సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేసింది ఐఏజీ.
బ్రిటిష్ ఎయిర్వేస్ కీలక నిర్ణయం తగ్గిన ఆదాయం..
బ్రిటిష్ ఎయిర్వేస్ సహ ఐబీరియా, బువేలింగ్ వంటి విమానయాన కంపెనీలకు మాతృసంస్థగా వ్యవహరిస్తున్న ఐఏజీ ఆదాయం ఇటీవల భారీగా క్షీణించింది. సంస్థ తొలి త్రైమాసిక ఆదాయం 13 శాతం తగ్గి.. 4.9 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు సంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్త సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్, మే మధ్య గత ఏడాదితో పోలిస్తే 94 శాతం తక్కువగా విమాన సేవలు నడుస్తున్నట్లు వెల్లడించింది.
ఐఏజీలో ప్రస్తుతం 4,000 మంది పైలట్లు, 16,500 మంది క్యాబిన్ సిబ్బంది సహా 45 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ ఇప్పటికే 23 వేల మంది వరకు ఉద్యోగులను సెలవులపై పంపింది.
ఇదీ చూడండి:30 ఏళ్ల తర్వాత నిధుల వేటలో రిలయన్స్