లాక్డౌన్ కారణంగా చాలామంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహిస్తూ.. వీడియో సమావేశాలకు 'జూమ్' యాప్‌ను వినియోగిస్తున్నారు. అయితే ఈ ప్లాట్‌పాం శ్రేయస్కరం కాదని వచ్చిన ఆరోపణలపై ఆ సంస్థ స్పందించింది. డేటా హ్యాకింగ్, వేధింపులు వంటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు జూమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ యువాన్ తెలిపారు.
పటిష్ఠ భద్రత..
భద్రతా పరమైన సమస్యలను కనిపెట్టినవారికి బహుమతులిచ్చే 'బగ్ బౌంటీ' కార్యక్రమం ద్వారా.. లూటా సెక్యూరిటీ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు యువాన్. అపరిచితుల నుంచి వచ్చే సంభాషణలు, వీడియో సమావేశాలను లాక్ చేసేలా ప్రత్యేకమైన సెట్టింగులను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
చైనా నుంచి డేటా హ్యాకింగ్ జరుగుతోందని అనుమానాలు తలెత్తుతున్న క్రమంలో.. ఈ వారంతం నుంచి చెల్లింపు ఖాతాదారులు వారి సమాచారాన్ని ఏ ప్రాంతాలకు మళ్లించాలో తామే ఎంపిక చేసుకునే సదుపాయాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.