తెలంగాణ

telangana

ETV Bharat / business

ఉద్యోగం కోల్పోయారా.. పరిహారంపై పన్ను రాయితీ!

కొవిడ్​-19 మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి కంపెనీ నుంచి ఉద్యోగికి కొంత పరిహారం లభించే అవకాశం ఉంది. అయితే వీటిపై పన్ను రాయితీ లభిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఒకవేళ రాయితీని క్లెయిం చేసుకోకపోతే.. మీ ట్యాక్స్​ శ్లాబ్​ను అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

compensation received after job loss
ఉద్యోగ పరిహారంపై పన్ను రాయితీ

By

Published : Apr 16, 2021, 4:02 PM IST

కరోనా మహమ్మారి మూలంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ క్రమంలో కంపెనీ నుంచి ఉద్యోగికి కొంత పరిహారం లభించే అవకాశం ఉంది. అయితే, వీటిపై పన్ను రాయితీ లభిస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. ఒకవేళ రాయితీని క్లెయిం చేసుకోకపోతే.. మీ ట్యాక్స్‌ శ్లాబ్‌ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 89, ఐటీ రూల్స్‌, 1962 లోని రూల్‌ నెం 21ఏ ప్రకారం రాయితీని పొందే అవకాశం ఉంది.

ఉద్యోగం కోల్పోయినందుకు కంపెనీ ఇచ్చే పరిహారంతో పాటు మరికొన్ని రాబడులపైనా పన్ను రాయితీ పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం కోల్పోయిన తర్వాత వచ్చే ముందస్తు వేతన చెల్లింపులు, వేతన బకాయిలు, ప్రావిడెండ్‌ ఫండ్‌, గ్రాట్యుటీ ముందస్తు ఉపసంహరణ, పింఛను బకాయిలపై కూడా పన్ను రాయితీ పొందే అవకాశం ఉంది.

షరతులు వర్తిస్తాయి..

రాజీనామా, తొలగింపు, తప్పనిసరి ఉద్యోగ విరమణ, వార్ధక్యం ఈ కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయి పరిహారం పొందిన వారికి మాత్రమే పన్ను రాయితీ ప్రయోజనాలు వర్తిస్తాయి. అలాగే రూల్‌ 21ఏ(1)(సీ), 21ఏ(4) ప్రకారం.. ఏ ఉద్యోగైనా సెక్షన్‌ 89 కింద పన్ను రాయితీ పొందాలంటే ఆ వ్యక్తి కనీసం మూడేళ్లు నిరంతర సేవలు అందించి ఉండాలి. అలాగే ఉద్యోగంలో కొనసాగేందుకు ఇంకా మూడేళ్ల కాలపరిమితి మిగిలి ఉండాలి. గ్రాట్యుటీపై రాయితీ పొందాలంటే కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ గ్రాట్యుటీ సొమ్ముకు పన్ను మినహాయింపు ఉంటే దానిపై రాయితీ క్లెయిం చేసుకోవడానికి వీల్లేదు. మినహాయింపు వర్తించని గ్యాట్యుటీ సొమ్మును వేతనంలో కలిపి మొత్తానికి రాయితీ పొందవచ్చు.

వీరికి వర్తించదు..

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకునే వారు పొందే పరిహారంపై కేవలం రూ.ఐదు లక్షల వరకు ఎలాగూ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇక రాయితీ వర్తించదు. ఒకవేళ రాయితీ కావాలనుకుంటే మినహాయింపు వదులుకోవాలి. అంటే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తి రూ.ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు, లేదా సెక్షన్‌ 89 ప్రకారం పన్ను రాయితీ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది.

రాయితీ ఎలా పొందాలంటే..

పరిహారం పొందిన ఏడాది ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో పన్ను రాయితీ క్లెయిం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫారం 10ఈ సమర్పించాలి. ఆన్‌లైన్‌లో ఐటీ రిటర్నలు దాఖలు చేయడానికి ముందే ఈ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది. ‘ఇన్‌కమ్‌ట్యాక్స్‌ఇండియాఈఫైలింగ్‌’ వెబ్‌సైట్‌లో ఈ ఫారం అందుబాటులో ఉంటుంది. అక్కడే నింపి ఆన్‌లైన్‌లోనే సమర్పించవచ్చు. గతంలో సెక్షన్‌ 89 కింద రాయితీ క్లెయిం చేసి ఫారం 10ఈ సమర్పించని వారికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ దీన్ని నింపడంలో సహాయం కావాలనుకుంటే ఆర్థిక నిపుణులను సంప్రదించవచ్చు.

ఇదీ చదవండి :ఆర్థిక వ్యవహారాల నూతన కార్యదర్శిగా అజయ్​ సేత్​

ABOUT THE AUTHOR

...view details