ప్రపంచంలోనే అతిపెద్ద ఫండ్ సంస్థల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకున్న నిర్ణయంతో ఏకంగా రూ.31,000 కోట్లు మూలనపడ్డట్లు అయింది. వీటికి విడుదల ఇప్పట్లో కనిపించేలా లేదు. ఈ ఫండ్ సంస్థ నిలిపివేసిన ఆ ఆరు పథకాలకు వచ్చిన నిధుల్లో ఎక్కువ భాగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న రంగాల్లో పెట్టడంతోనే పుట్టి మునిగినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం ఇతర ఫండ్ సంస్థలపైనా కనిపించే ప్రమాదం లేకపోలేదు.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా తాజాగా నిలిపివేసిన ఆరు పథకాలు ఎక్కువగా బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల్లో అధిక శాతం పెట్టుబడులు పెట్టాయి. వీటిలో ఆ పథకాలు రూ.14,564 కోట్ల మేర పెట్టాయి. ఇక విద్యుత్ రంగంలో రూ.5532 కోట్లు; మౌలిక రంగం, స్థిరాస్థిలో రూ.3480 కోట్ల మేర ఈ పథకాలు పెట్టుబడులు పెట్టాయి. అంటే రూ.23,567 కోట్లు లేదా 76.41 శాతం మేర మొత్తం పెట్టుబడులు ఈ రంగాల్లోనే పెట్టినట్లు అకార్డ్‌ఫిన్‌టెక్ అనే ఆర్థిక సమాచార సంస్థ వద్ద ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
విచిత్రం ఏమిటంటే మొత్తం ఫ్రాంక్లిన్ ఇండియాకు చెందిన పథకాలన్నీ కలిపి ఎన్‌బీఎఫ్‌సీల్లో రూ.18,000 కోట్లు; విద్యుత్ రంగంలో రూ.5,778 కోట్లు; స్థిరాస్తి, మౌలికంలో రూ.4,132 కోట్లుగా ఉన్నాయి. అంటే ఆ ఆరు పథకాలే ఈ మూడు రంగాల్లో అధిక భాగం వాటా పెట్టుబడులు పెట్టాయన్నమాట.
అవి ఎపుడు కోలుకుంటాయి..
పై రంగాల్లోని కంపెనీలకు చెందిన రుణ పత్రాలు(డెట్ పేపర్స్) పరిస్థితి మరింత క్షీణించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కూడా ఇవి ద్రవ్యలభ్యత సమస్యను ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.
- నివాస సముదాయ డెవలపర్లకు ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలిచ్చాయి. అయితే వారి నుంచి బాకీలు వసూలు చేయడంలో అవి కష్టాలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ రేటింగ్స్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఒక విధంగా చూస్తే వాణిజ్య డెవలపర్లు కొంత మెరుగ్గా ఉన్నారని.. వీరి క్లయింట్లు ఎక్కువగా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలకు చెందిన వారు కావడం ఇందుకు నేపథ్యమని ఆ వ్యక్తి చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు 3-6 నెలల పాటు కొనసాగితే వీరికీ కొంత సెగ తగలకతప్పదనీ అంచనా వేశారు.
- ఎన్‌బీఐఎఫ్‌సీలకు రుణాలిచ్చే నిమిత్తం ఆర్‌బీఐ గత గురువారం బ్యాంకులకు కొత్త గవాక్షాన్ని తెరచినా.. బ్యాంకులు ముందుకు రాలేదు. ఎన్‌బీఎఫ్‌సీలకు మరిన్ని రుణాలివ్వడానికి అవి వెనకడుగు వేస్తున్నాయి. ఈ సమయంలో ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులు అందకపోతే ఫ్రాంక్లిన్ సహా వివిధ రుణ సంస్థలకు తిరిగి చెల్లింపులు చేయడం సంక్లిష్టమే.
- ఇక లాక్‌డౌన్ కారణంగా వాణిజ్య కంపెనీలన్నీ మూతపడడంతో విద్యుత్ గిరాకీ తగ్గింది. డిస్కంల ఆదాయంపై ఇది ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వీటిలో ద్రవ్య ఒత్తిళ్లు కనిపిస్తే ఆ ప్రభావం పరోక్షంగా కొన్ని విద్యుత తయారీ కంపెనీలపైనా పడవచ్చు.