ఐక్యరాజ్యసమితి ప్రపంచ పరిస్థితులు, అవకాశాలు (డబ్ల్యూఈసీపీ) 2020 పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. 2020లో మాత్రం భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల అర్థికవృద్ధి పుంజుకునే అవకాశం ఉందని అభిప్రాయపడింది
వృద్ధి తగ్గినా.. ఆశాజనకమే..
7.6 శాతంగా ఉన్న భారత జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.7 శాతానికి తగ్గించింది డబ్ల్యూఈఎస్పీ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 7.4 నుంచి 6.6 శాతానికి తగ్గించింది. 2021లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో ఇది 6.3 శాతం ఉంటుందని అంచనా వేసింది.
బ్రెజిల్, భారత్, మెక్సికో, రష్యా, టర్కీలో ఈ ఏడాది తలసరి ఆదాయం క్షీణించడమో, స్తబ్దుగా ఉండటమో జరుగుతుందని ఐరాస తన నివేదికలో పేర్కొంది. అయితే 2020లో మాత్రం వీటి జీడీపీ వృద్ధిరేటు 4 శాతానికి మించి పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
తగ్గుతున్న వృద్ధి
సుదీర్ఘ వాణిజ్య వివాదాల కారణంగా 2019లో ప్రపంచ వృద్ధిరేటు కేవలం 2.3 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 1.8 శాతం వృద్ధిరేటుతో ముగుస్తుందని ఐరాస అంచనా వేసింది.
సాధ్యమే.. కానీ
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం... 2020లో 2.5 శాతం వృద్ధిరేటు సాధ్యమే. అయితే భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం పెరగడం ఇందుకు అడ్డుగా ఉన్నాయని ఐరాస అభిప్రాయపడింది.
"ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘంగా కొనసాగుతున్న మందగమనం... సుస్థిర అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పన ఆశయాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. అదే సమయంలో విస్తృతమైన అసమానతలు, వాతావరణ సంక్షోభం, ఆహార అభద్రత, పోషకాహార లోపం.. జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో పెరుగుతున్న అసంతృప్తికి మరింత ఆజ్యం పోస్తూనే ఉన్నాయి."
- డబ్ల్యూఈసీపీ
ఇవన్నీ అభివృద్ధి అవకాశాలపై తీవ్రమైన, దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ హెచ్చరించారు. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారంతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి:ఎన్పీఏల భయంతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు