దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)పై తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసిక (ఏప్రిల్-జూన్) జీడీపీ వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరంలోని చివరి మూడు నెలలు (2021 జనవరి-మార్చి) కన్నా పడిపోయే అవకాశం ఉందని భావిస్తోంది.
వైరస్ కట్టడికి గతంలో మాదిరిగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడానికి బదులు ప్రజలు భౌతిక దూరం పాటించేలా నిబంధనలను కఠినంగా అమలు చేయడమే ఉత్తమమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలను సృష్టించేందుకు మౌలిక వసతుల కల్పన రంగంలో పెట్టుబడులను అధికం చేసే ఆలోచన ఉన్నప్పటికీ పారిశ్రామికవాడల్లో ఆంక్షలు, వలస కూలీలు స్వస్థలాలకు తిరిగి వెళ్లడం వంటి కారణాల రీత్యా అది సాధ్యం కాకపోవచ్చని అనుకుంటున్నారు. గ్రామాలకు చేరుకున్న వలస కూలీలకు అక్కడే పనులు కల్పించేలా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల చేయడమే ఉత్తమ మార్గంగా కనిపిస్తోంది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఉపాధిహామీకి రూ.73 వేల కోట్లు కేటాయించింది.