2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని పెట్టుకున్న లక్ష్యం కష్టమే అయినప్పటికీ అసాధ్యమైనది మాత్రం కాదని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. దేశీయ ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై తక్కువ ఆధారపడటం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించొచ్చని అన్నారు.
బలమైన సంకల్పంతో
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ 29వ అంతర్జాతీయ సదస్సులో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ‘ఏ లక్ష్యాన్నయినా సాధించాలంటే బలమైన రాజకీయ సంకల్పం ఉండాలి. ఆ సంకల్పాన్ని వ్యక్తపరుస్తూ ప్రధాని మోదీ మనకు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా నిర్దేశించారు. ఆ లక్ష్యం కష్టమే కావొచ్చు.. కానీ అసాధ్యం కాదు. మన దేశానికి ఎన్నో వనరులు ఉన్నాయి. ఉత్పత్తి సామర్థ్యం కూడా ఉంది. వాటిని పక్కనబెట్టి మనం ఏటా వేలకోట్లను మందులు, వైద్య పరికరాలు, బొగ్గు, రాగి వంటి వాటి దిగుమతులపై ఖర్చు చేస్తున్నాం. అలా కాకుండా దిగుమతులను తగ్గించుకుని దేశీయ ఉత్పత్తిని పెంచుకుంటే 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోగలం’ అని చెప్పుకొచ్చారు.