కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఫిబ్రవరి 1న స్టాక్‌మార్కెట్లు పనిచేస్తాయని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది.
ప్రత్యేక పరిస్థితుల్లో
ఫిబ్రవరి 1 శనివారం. సాధారణంగా శని, ఆదివారాల్లో మార్కెట్లకు సెలవు. ప్రత్యేక పరిస్థితులు మినహా సెలవు దినాల్లో మార్కెట్లు పనిచేయవు. అయితే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఈ సారి శనివారం కూడా ట్రేడింగ్ నిర్వహించాలని బీఎస్ఈ నిర్ణయించింది. సాధారణ రోజుల్లానే ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 నిమిషాల వరకు సెషన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ట్రేడర్ల అభ్యర్థన మేరకు
2020-21 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెడుతున్న ఈ కేంద్ర బడ్జెట్లో ఈసారి కీలక సంస్కరణలకు ప్రతిపాదనలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 1న ట్రేడింగ్ నిర్వహించాలని చాలా మంది ట్రేడర్లు అభ్యర్థించారు. ఫలితంగానే బీఎస్ఈ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.