ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3 లక్షలకు పెంచాలని, సంస్థలపై కనీస ప్రత్యామ్నాయ పన్ను (ఎమ్ఏటీ) రద్దు చేయాలని పన్నుల రంగం నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల ఎదుగుదల, ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని చెబుతున్నారు.
చాలా ఆశలు పెట్టుకున్నారు..
దేశంలో మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థికమంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ జూలై 5న తన మొదటి కేంద్ర వార్షిక బడ్జెట్ లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి సమాయత్తమవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో పాటు ఇతర వాటాదారులతోనూ సంప్రదింపులు జరిపారు. ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ 2019-20 వార్షిక బడ్జెట్‌పై తమ వివరణాత్మక సలహాలను ఇచ్చాయి.
"అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్లు భారత్‌పై ప్రభావం చూపనప్పటికీ, దేశీయంగా అనేక సవాళ్లు ఉన్నాయి. బడ్జెట్‌పై సామాన్య ప్రజలు మాత్రం చాలా ఆశలు పెట్టుకున్నారు."
-కుల్దీప్ కుమార్, పార్టనర్ అండ్ లీడర్, పర్సనల్ టాక్స్, పీడబ్ల్యూసీ ఇండియా
మధ్యంతర బడ్జెట్లో...
మోదీ 1.0 ప్రభుత్వం ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో, పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయకుండా... రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పూర్తి పన్ను రిబేటు కల్పించింది. ఇంతకు మునుపు ఈ పరిమితి రూ.3.5 లక్షలుగా ఉండేది.
ఈ చర్యవల్ల తక్కువ ఆదాయం కలిగిన వర్గం బాగా లబ్ధి పొందింది. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది.
పన్నులు తగ్గించండి..
"ప్రస్తుతం బడ్జెట్లో ప్రభుత్వం.. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.50 వేలకు(రూ2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు) పెంచే అవకాశాలున్నాయి. ప్రత్యామ్నాయంగా 5 శాతం శ్లాబును రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు పెంచే అవకాశం ఉంది. ఫలితంగా పన్ను భారం 20 శాతం నుంచి 5 శాతానికి తగ్గేలా ఉంది."- కుల్దీప్ కుమార్, పార్టనర్ అండ్ లీడర్, పర్సనల్ టాక్స్, పీడబ్ల్యూసీ ఇండియా
గృహనిర్మాణ రంగానికీ చేయూతనివ్వాలని, సొంత ఇళ్లను కొనుగోలు చేయడానికి పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించాలని కుల్దీప్ సూచించారు. గృహ రుణాలపై ఉన్న వడ్డీ తగ్గింపును... ప్రస్తుతమున్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలనీ ఆయన సూచించారు.