విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వ్యవహారం మదిరిగానే.. మరో ఆర్థిక కుంభకోణం బయట పడింది. బాస్మతీ బియ్యం ఎగుమతి చేసే రామ్ దేవ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రమోటర్లు ఆరు బ్యాంకులకు రూ.411 కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైనట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేసింది ఎస్బీఐ.
రామ్‌దేవ్ ఇంటర్నేషనల్ సంస్థ తీసుకున్న రుణాలను 2016 జనవరి 27 నుంచి నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది ఎస్బీఐ. ఈ విషయమై ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఫిర్యాదు చేయగా.. ఏప్రిల్ 28న కేసు నమోదు చేసింది సీబీఐ.
రాందేవ్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్లు నరేశ్ కుమార్, సురేశ్ కుమార్, సంగీతలపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ప్రస్తుతానికి ఎలాంటి తనిఖీలు చేయడం లేదని వెల్లడించింది. ఈ కేసులో నిందితులకు తొలుత సమన్లు జారీ చేస్తామని.. స్పందించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.