తెలంగాణ

telangana

ETV Bharat / business

జియో గిగాఫైబర్​లో కొత్త ట్విస్ట్- కేబుల్​ టీవీ కష్టమే!

రిలయన్స్​ జియో గిగాఫైబర్​... టెలికాం, వినోద రంగంలో సరికొత్త సంచలనం. బ్రాడ్​బ్యాండ్​, ల్యాండ్​లైన్​, డీటీహెచ్​... ఈ మూడు సేవలు ఒకే ప్లాన్​తో లభిస్తాయని అంతా అనుకున్నారు. కానీ... టారిఫ్​ ప్లాన్స్​ విశ్లేషిస్తే పరిస్థితి అలా లేదు. సెట్​ టాప్​ బాక్స్​ ఉచితంగా ఇచ్చినా... టీవీ ఛానళ్లు చూడాలంటే లోకల్​ కేబుల్​ ఆపరేటర్​ నుంచి కనెక్షన్​ తీసుకోవడం తప్పనిసరిగా కనిపిస్తోంది.

By

Published : Sep 7, 2019, 6:58 AM IST

Updated : Sep 29, 2019, 5:55 PM IST

జియో గిగాఫైబర్​లో కొత్త ట్విస్ట్- కేబుల్​ టీవీ కష్టమే!

ఎదురుచూపులకు తెరపడింది. దాదాపు ఏడాదిగా ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న రిలయన్స్​ జియో గిగాఫైబర్​ రానే వచ్చింది. సెప్టెంబర్​ 5న వాణిజ్య సేవలు ప్రారంభమయ్యాయి. టారిఫ్​ ప్లాన్లు, నియమనిబంధనలు బయటకు వచ్చాయి.

జియో గిగాఫైబర్​ ప్లాన్లు రూ.699 నుంచి మొదలయ్యాయి. 100ఎంబీపీఎస్​ నుంచి 1 జీబీపీఎస్​ స్పీడ్​ వరకు వేర్వేరు కేటగిరీల ఆధారంగా నెలవారీ టారిఫ్​లు ఉన్నాయి. కొత్త కనెక్షన్​ తీసుకోవాలంటే రూ.2500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఇందులో రూ.1000 ఇన్​స్టలేషన్​ ఛార్జ్. ఎప్పటికీ తిరిగిరాదు. మిగిలిన రూ.1500 రిఫండబుల్.
రిలయన్స్ జియో గిగా ఫైబర్​ ప్లాన్లు విశ్లేషిస్తే కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి.

సెట్​ టాప్​ బాక్స్​ ఉచితం... కానీ...

"జియో సెట్​ టాప్​ బాక్స్​... ఓ అద్భుతం"... రిలయన్స్ వర్గాలు పదేపదే చెప్పే మాట. అందుకు తగినట్లే అందులో అనేక కీలక ఫీచర్లు ఉన్నాయి. వీడియో కాలింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్, గేమింగ్, మిక్స్​డ్ రియాల్టీ... ఇలా అధునాతన సౌకర్యాలన్నీ సెట్​ టాప్​ బాక్స్​లో ఉన్నాయి.

ప్రతి చందాదారుడికి సెట్​ టాప్​ బాక్స్​ ఉచితంగా అందిస్తామని జియో ప్రకటించింది. ఇక్కడే ఓ చిక్కు ఉంది. సెట్​ టాప్​ బాక్స్​లో ఉన్న ఫీచర్లు అన్నింటినీ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చు... టీవీ ఛానళ్లు చూడడం మినహా.

టీవీ ఛానళ్లు చూడాలంటే మాత్రం... స్థానిక కేబుల్​ ఆపరేటర్​ నుంచి కనెక్షన్​ తీసుకుని, జియో సెట్​ టాప్​ బాక్స్​కు అనుసంధానం చేసుకోవాల్సిందే.

ఎందుకలా..?

ఐపీటీవీ(ఇంటర్నెట్​ ప్రోటోకాల్ టీవీ) విధానంలో కేబుల్​ టీవీ సేవలు అందించాలని తొలుత భావించింది జియో. కానీ... సాధ్యపడలేదు. ఐపీటీవీ సేవలు తీసుకొస్తే లోకల్ కేబుల్ ఆపరేటర్ల వ్యాపారం దెబ్బతింటుందని తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే వ్యూహం మార్చింది జియో.

కేబుల్​ నెట్​వర్కింగ్​లో దిగ్గజ సంస్థలైన హాత్​వే, డెన్​ నెట్​వర్క్​లో ఇప్పటికే మెజార్టీ వాటా కొనుగోలు చేసింది రిలయన్స్. ఇతర స్థానిక కేబుల్ ఆపరేటర్లూ గిగాఫైబర్​లో భాగస్వాములై, జియో సెట్​ టాప్​ బాక్స్​ ద్వారా టీవీ ఛానళ్లు అందించాలని కోరుతోంది ఆ సంస్థ. ఇప్పటివరకు ఎంతమంది లోకల్ కేబుల్​ ఆపరేటర్లు గిగాఫైబర్​లో భాగస్వాములు అయ్యారన్న అంశంపై స్పష్టత లేదు.

ఇదీ చూడండి:-'సవాళ్లు అధిగమించేందుకు సాధ్యమైనంత సాయం'

Last Updated : Sep 29, 2019, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details