IPOs in march quarter: 2021లో భారీ స్థాయిలో ఐపీఓలు సందడి చేశాయి. ఆ పరంపర ఈ ఏడాదిలోనూ కొనసాగనుంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ పెద్ద ఎత్తున పబ్లిక్ ఇష్యూలు రానున్నట్లు పలువురు మర్చంట్ బ్యాంకర్లు తెలిపారు. దాదాపు 24 కంపెనీలు రూ.44,000 కోట్లు సమీకరించనున్నట్లు అంచనా వేశారు. వీటిలో చాలా వరకు టెక్నాలజీ ఆధారిత కంపెనీలేనని పేర్కొన్నారు.
'ఓయో', 'డెలివరీ' సహా...
Public issues of fy21:2021లో 63 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. రూ.1.2 లక్షల కోట్లు సమీకరించాయి. వీటితో పాటు పవర్‌గ్రిడ్ ఇన్విట్ రూ.7,735 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రిట్స్ రూ.3,800 కోట్లు రాబట్టాయి. అధిక ద్రవ్యలభ్యత, భారీ లిస్టింగ్ గెయిన్స్ ఐపీఓల్లో రిటైల్ మదుపర్ల భాగస్వామ్యానికి దోహదం చేశాయి. ఇక ఈ త్రైమాసికంలో హోటల్ అగ్రిగేటర్ ఓయో(రూ.8,430 కోట్లు), సప్లయ్ చైన్ సంస్థ 'డెలివరీ' (రూ.7,460 కోట్లు) వంటి భారీ ఐపీఓలు రానున్నాయి. వీటితో పాటు అదానీ విల్మర్(రూ.4,500 కోట్లు), ఎమ్‌క్యూర్ ఫార్మా(రూ.4,000 కోట్లు), వేదాంత్ ఫ్యాషన్స్(రూ.8,430 కోట్లు), పారాదీప్ పాస్ఫేట్స్(రూ.2,200 కోట్లు), మేదాంత (రూ.2,000 కోట్లు), ఇక్సిగో(రూ.1800 కోట్లు) వంటి సంస్థలు కూడా పబ్లిక్ ఇష్యూకి సిద్ధంగా ఉన్నాయి.