తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రభుత్వ మద్దతు లేకుండా 'రిటైల్​‌ పరిశ్రమ' మనుగడ కష్టమే! - corona impact on business

కరోనా దెబ్బకు కుదేలవుతున్న వ్యాపార రంగాల్లో రిటైలింగ్ పరిశ్రమ ఒకటి. ప్రభుత్వం ఆదుకోకపోతే దేశీయ రిటైల్ పరిశ్రమ కుంగిపోతుందని, ఆర్థిక వ్యవస్థకూ నష్టం జరుగుతుందని ఈనాడుతో ముఖాముఖిలో వివరించారు ‘రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ కుమార్‌ రాజగోపాలన్‌. పలు కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

interview with retailers association CEO
ప్రభుత్వ మద్దతు లేకుండా రిటైలింగ్‌ పరిశ్రమ మనుగడ కష్టమే

By

Published : Apr 26, 2020, 6:41 AM IST

కరోనా వైరస్‌ విస్తరణ, ‘లాక్‌డౌన్‌’ వల్ల బాగా నష్టపోతున్న రంగాల్లో రిటైలింగ్‌ పరిశ్రమ ఒకటి. నిత్యావసర వస్తువులు, ఆహారపదార్థాలు, ఔషధాల విక్రయ వ్యాపారాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల వస్తువులు విక్రయించే షాపులు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో దేశీయ రిటైలింగ్‌ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని, లేనిపక్షంలో పరిశ్రమ కుంగిపోవటంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థకు సైతం నష్టం జరుగుతుందని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ కుమార్‌ రాజగోపాలన్‌ అభిప్రాయపడ్డారు. పరిశ్రమ స్థితిగతులు, ఇబ్బందులను ఆయన ‘ఈనాడు’ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

కొవిడ్‌-19 ప్రభావం రిటైలింగ్‌ పరిశ్రమపై ఏమేరకు ఉంది?

ఫిబ్రవరి నెలాఖరు నాటికే వ్యాపారం 20- 25 శాతం తగ్గింది. గత నెలన్నర వ్యవధిలో ఇదిం మరింత క్షీణించింది. దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు, క్రీడా సామగ్రి, ఫర్నిచర్‌, ఎలక్ట్రానిక్స్‌... తదితర అత్యసరం కాని వస్తువులు విక్రయించే రిటైలింగ్‌ సంస్థలకు వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. దుస్తుల పరిశ్రమకు ఆదాయ నష్టం 40 శాతం వరకూ ఉంది. ఈ విభాగంలోని చిన్న, మధ్యస్థాయి వర్తకులు కోలుకోవటం ఎంతో కష్టం. దాదాపు 25 శాతం మంది ఈ వ్యాపారం నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. అంతేగాక కోటి ఉద్యోగాలు పోవచ్చు.

దేశీయ రిటైలింగ్‌ పరిశ్రమ ఎంత పెద్దది?

రిటైలింగ్‌ పరిశ్రమలో చిన్న, పెద్ద... అంతా కలిసి 1.50 కోట్ల మంది వర్తకులు ఉన్నారు. ఈ రంగంలో ప్రత్యక్షంగా 5 కోట్ల మంది పనిచేస్తున్నారు. 2019 లో దేశీయ రిటైలింగ్‌ పరిశ్రమ పరిమాణం 717 బిలియన్‌ డాలర్లు. దేశీయ వినియోగంలో రిటైలింగ్‌ పరిశ్రమ వాటా 40 శాతం కాగా, జీడీపీ లో 10 శాతం ఈ రంగమే సమకూర్చుతోంది.

ఈ సంక్షోభ సమయంలో వర్తకులను ఆదుకోవటానికి మీరేం చేస్తున్నారు?

దేశంలోని అతిపెద్ద రిటైలింగ్‌ సంఘంగా... వర్తకులకు ఈ కష్టకాలంలో అండగా నిలిచేందుకు చేయగలిగిందంతా చేస్తున్నాం. అన్ని స్థాయిల్లోని వర్తకులతో మాట్లాడుతూ పరస్పరం చేదోడు వాదోడుగా ఉండాలని సూచిస్తున్నాం. అత్యవసర వస్తువుల సరఫరా విషయానికి వచ్చే సరికి ‘ఫుడ్‌ సోల్జర్‌ ప్రాజెక్టు’ చేపట్టాం. ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో దేశవ్యాప్తంగా ఆహార పదార్ధాలు, ఇతర నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా సరఫరాలు సజావుగా సాగటానికి మా వంతుగా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర వస్తువుల సరఫరాకు సిబ్బంది కొరత ఏర్పడితే, అత్యవసరం కాని రిటైలింగ్‌ సంస్థల్లోని సిబ్బందిని పిలిపించి అత్యవసర పనులకు పురమాయిస్తున్నాం.

మీ అంచనా ప్రకారం ప్రస్తుత సంక్షోభం నుంచి ఈ పరిశ్రమ కోలుకోవటానికి ఎంత సమయం పడుతుంది?

‘కరోనా’ ముప్పు ఎంత త్వరగా తగ్గిపోతుందనే దానిపై రిటైలింగ్‌ పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వ మద్దతు కూడా ముఖ్యమే. ‘లాక్‌డౌన్‌’ పూర్తయ్యాక, రిటైలింగ్‌ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలైన నాటి నుంచి పరిశ్రమ కోలుకోవటానికి 9 నెలలైనా పడుతుంది. ప్రభుత్వం మద్దతిస్తే కాస్త త్వరగా కోలుకునే అవకాశం వస్తుంది.

ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు?

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు కొన్ని ఉద్దీపనా పథకాలు ప్రకటించాయి. కానీ సంక్షోభం తీవ్రతను చూస్తే ఇది సరిపోకపోవచ్చు. రిటైలింగ్‌ పరిశ్రమకు ప్రత్యక్ష మద్దతు కావాలి. ‘లాక్‌డౌన్‌’ కాలానికి, ఆ తర్వాత ‘రికవరీ కాలానికి’ ఉద్యోగుల జీతభత్యాల్లో 50 శాతాన్ని ప్రభుత్వం నగదు రూపంలో ఇవ్వటం, అత్యవసరం. రిటైలర్లకు రుణభారం అధికంగా ఉంది. అందువల్ల వచ్చే 9 నెలల కాలానికి రుణాలపై అసలు, వడ్డీ వాయిదా వేయాలి. బిల్‌ డిస్కౌంటింగ్‌, లెటర్స్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సదుపాయాలను కూడా ఈ ‘మారటోరియం’ లో భాగంగా ఉండాలి. క్యాష్‌ క్రెడిట్‌ సదుపాయాలను విస్తరించాలి.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ తర్వాత ఆన్​లైన్ షాపింగ్​దే హవా!

ABOUT THE AUTHOR

...view details