india oil import from russia: ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై వస్తున్న విమర్శలను భారత్ గట్టిగా తిప్పికొట్టింది. దేశీయ అవసరాలకు దిగుమతులే కీలకమైనందున.. ఎక్కడ చౌక ధరలకు చమురు లభించినా కొనుగోలు చేస్తుంటామని, ఉత్పత్తిదారుల నుంచి అటువంటి ఆఫర్లను ఆహ్వానిస్తుంటామని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇంధన వనరుల్లో స్వయంసమృద్ధి సాధించిన దేశాలు, రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్న దేశాలు భారత చట్టబద్ధ దిగుమతులను రాజకీయం చేయడం తగదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే పెరిగిపోతున్న ఇంధన ధరలకు ఉక్రెయిన్ పరిణామాలు మరింతగా ఆజ్యం పోశాయని, భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఇది మరింత ఒత్తిడికి గురిచేసిందని వివరించాయి. దేశ ముడి చమురు అవసరాల్లో రష్యా దిగుమతులు ఒక్క శాతం కన్నా తక్కువేనని తెలిపాయి. అదీ కూడా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య వ్యాపారం జరగడంలేదని గుర్తు చేశాయి. భారత వ్యాపారులు ప్రపంచ మార్కెట్లలో ఎక్కడ చౌకగా ఇంధనం లభిస్తే అక్కడి నుంచి కొనుగోళ్లు జరుపుతున్నారని స్పష్టం చేశాయి. రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు ఇంధనాన్ని కొనుగోలు చేసే విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా తోసిపుచ్చలేదు. గురువారం దిల్లీలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ "ఇంధన అవసరాలకు భారత్ అత్యధిక భాగం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయ అవసరాల రీత్యా ప్రపంచ మార్కెట్లలో ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తుంటాం. అనేక దేశాలు, ముఖ్యంగా ఐరోపా దేశాలు కూడా ఇదే పనిచేస్తున్నాయి. భారత్‌పై విమర్శలు చేసే వారిని వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా" అని తెలిపారు. రష్యా, భారత్‌ల మధ్య రూబుల్, రూపాయి మారకంలో వాణిజ్యం గతంలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు.
చమురు సరఫరాకు ఇరాన్ సిద్ధం..