తెలంగాణ

telangana

ETV Bharat / business

కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు

ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో... మినహాయింపులతో ఉండే ఎక్కువ పన్ను శ్లాబు (పాత విధానం)ను కొనసాగించాలా? పన్నులో ఎలాంటి మినహాయింపులు లేని తక్కువ శ్లాబు (కొత్త విధానం)ను ఎంచుకోవాలా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దీనికి ఓ వివరణ ఇచ్చారు. మినహాయింపులు ఉండవని చెప్పినప్పటికీ... కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులుంటాయని స్పష్టం చేశారు.

The new policy also has some exceptions
కొత్త విధానంలోనూ కొన్ని మినహాయింపులు

By

Published : Feb 3, 2020, 7:34 AM IST

Updated : Feb 28, 2020, 11:17 PM IST

ఆదాయ పన్ను చెల్లింపు విషయమై బడ్జెట్‌లో ప్రతిపాదించిన ద్వంద్వ విధానంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. మినహాయింపులతో ఉండే ఎక్కువ పన్ను శ్లాబు (పాత విధానం)ను కొనసాగించాలా? పన్నులో ఎలాంటి మినహాయింపులు లేని తక్కువ శ్లాబు (కొత్త విధానం)ను ఎంచుకోవాలా? అన్నది సమస్యగా మారింది.

పన్ను చెల్లింపుదారులదే ఛాయిస్​!

శ్లాబుల ఎంపిక అంశాన్ని పన్ను చెల్లింపుదార్లకే ప్రభుత్వం విడిచిపెట్టింది. అసలు ఇలాంటి ద్వంద్వ విధానం తీసుకురావాలన్న ప్రతిపాదనే సంక్ష్లిష్టమైనదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కొత్త విధానాన్ని ఎంచుకుంటే తరువాత సంవత్సరాల్లోనూ దానినే కొనసాగించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయమై వివరణలు ఇస్తున్నామని, అవసరమైతే మరికొన్ని ఇస్తామని తెలిపారు. కొత్త విధానం వల్ల తప్పకుండా కొన్ని శ్లాబుల వారికి లబ్ధి కలుగుతుందని అన్నారు. ఒక వేళ కొత్త విధానంలో ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితులు వస్తే అలాంటిదాన్ని ఎందుకు తీసుకొస్తామని ప్రశ్నించారు.

‘‘ఆదాయ పరిమితులను భారీగా తగ్గించినందున తప్పకుండా కొత్త విధానంలో కొన్ని శ్లాబుల వారికి లబ్ధి కలుగుతుంది. మినహాయింపులు ఉండబోవని నేను పదేపదే చెబుతున్నప్పటికీ కొత్త విధానంలోనూ కొన్ని కొనసాగుతాయి’’

- నిర్మలా సీతారామన్​, ఆర్థికమంత్రి

ఎన్‌ఆర్‌ఐలు ఇక్కడ లేకున్నాఆదాయం వస్తోందిగా..!

ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) విదేశాల్లో సంపాదిస్తున్న సొమ్ముపై పన్ను విధించే ఉద్దేశం లేదని, వారికి ఇక్కడ ఉన్న ఆస్తులపై వచ్చే ఆదాయంపైనే పన్ను వేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో పేర్కొన్న ఎన్‌ఆర్‌ఐల పన్నుపై సందిగ్ధం నెలకొనడంతో ఆమె ఉదాహరణలతో వివరణ ఇచ్చారు.

‘‘మీకు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. దానిపై అద్దెలు వస్తున్నాయి. మీరు ఇక్కడ ఉండకపోయినా అద్దెల రూపంలో వస్తున్న ఆదాయాన్ని అక్కడికి తీసుకెళ్తున్నారు. దీనిపై మీరు అక్కడా పన్ను కట్టడం లేదు. ఇక్కడా చెల్లించడం లేదు. అయితే భారత్‌లోనే మీ ఆస్తి ఉన్నందున పన్ను వేసే అధికారం నాకుంది. మీరు దుబాయ్‌లో ఆర్జించినదానిపై పన్ను వేయడం లేదు. మీరు అక్కడ ఉంటున్నా, ఇక్కడా ఆదాయాన్ని సంపాదించారు కాబట్టే దీనిపైనే పన్ను వేస్తున్నా’’- - నిర్మలా సీతారామన్​, ఆర్థికమంత్రి

కొంతమంది పన్నులు తక్కువగా ఉండే, అసలు పన్నులే లేని దేశాలకు ఆదాయాన్ని తరలిస్తున్నందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నిర్మలా సీతారామన్​ తెలిపారు. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ పాండే మాట్లాడుతూ గల్ఫ్‌ దేశాల్లో పనిచేస్తున్న నిజమైన కార్మికులు, మర్చంట్‌ నేవీ ఉద్యోగులకు ఈ నిబంధన వర్తించదని తెలిపారు.

ఏ విధానంతో ఎవరికి లబ్ధి?

అధికార వర్గాల విశ్లేషణ ప్రకారం పాత విధానంతో వార్షిక ఆదాయం 12 లక్షలలోపు ఉండి, ఏటా రూ.2 లక్షల వరకు మినహాయింపులు పొందుతున్న వారికి లబ్ధి కలుగుతుంది. స్టాండర్డ్‌ డిడక్షన్‌, ఇంటి రుణం వడ్డీలు, బీమా పాలసీలు, వైద్య బీమా, పింఛను పథకాలకు చెల్లింపుల ద్వారా ఈ వర్గం వారు పన్ను మినహాయింపులు పొందుతున్నారు. మొత్తం 5.78 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఉండగా, ఇందులో 5.3 కోట్ల మంది అంటే 90 శాతం మంది రూ.2 లక్షలలోపు మినహాయింపులు పొందుతున్నవారే కావడం గమనార్హం.

వార్షికాదాయం రూ.13 లక్షలకన్నా అధికంగా ఉండే ధనిక వర్గాలకు కొత్త విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం వారూ రూ.2లక్షల వరకు మినహాయింపులు పొందే అవకాశం ఉంది. కొత్త విధానంలో ఈ అవకాశం లేనప్పటికీ, ప్రస్తుతం చెల్లించేదానికన్నా తక్కువ పన్నే చెల్లిస్తే సరిపోతుంది. జీతాలు పొందని నాన్‌-శాలరీ వర్గంలోని వారికీ కొత్త విధానమే మంచిది.

పొదుపు తగ్గుతుంది

కొత్త విధానంపై క్లియర్‌ట్యాక్స్‌ సంస్థకు చెందిన అర్చిత్‌ గుప్తా అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత విధానంలోని 80సీ సెక్షన్‌ కింద దీర్ఘకాలిక పొదుపు చేయడానికి ప్రోత్సాహకాలు ఉండేవని తెలిపారు. ఇప్పుడు పన్ను ఆదా చేసే అవకాశాలు లేకపోవడంతో పొదుపు చేయాలన్న ఆసక్తి తగ్గుతుందని అన్నారు. రెలిగేర్‌ బ్రోకింగ్‌కు చెందిన అజిత్‌ మిశ్రా తన అభిప్రాయం చెబుతూ కొత్త విధానంలోనూ చాలా మినహాయింపులు ఉండే అవకాశం ఉందని, చివరకు పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అన్నారు.

ఇదీ చూడండి: దక్షిణాది రాష్ట్రాలకు 'ఆర్థిక' సంకెళ్లు!

Last Updated : Feb 28, 2020, 11:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details