‘పదిహేనో ఆర్థిక సంఘం 2020-21 సంవత్సరానికి సంబంధించి చేసిన సూచనల్ని గణనీయంగా సహకార సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం ఆమోదించింద’ని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. నిరుడు డిసెంబరు తొలివారంలోనే కేంద్రం సముఖానికి చేరిన కీలక సూచనల గుట్టుమట్లు తొలిసారి వెల్లడి కాగా, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికపై దక్షిణాది రాష్ట్రాల భయ సందేహాలే వాస్తవ రూపం దాల్చాయిప్పుడు! ప్రగతి శీల రాష్ట్రాలు మరింతగా పురోగమించడానికి, వెనుకబాటుతనంతో కుంగుతున్నవి జాతీయ సగటుకు చేరుకోవడానికి బాటలు పరవడమే తమ ధ్యేయమని ఆర్థిక సంఘం సారథి ఎన్‌కే సింగ్ సెలవిచ్చినా ‘కరవులో అధిక మోసం’లా ఉన్న కేటాయింపులు దక్షిణాదిని దిగ్భ్రాంతపరుస్తున్నాయి.
రాబడిలో తమిళనాట అదృష్టం...
పదిహేనో ఆర్థికసంఘం నెత్తికెత్తుకొన్న కొత్త కొలమానాల కారణంగా విభాజ్య నిధుల్లో వాటా 20 రాష్ట్రాలకు పెరగ్గా, తక్కిన ఎనిమిదింటికి తెగ్గోసుకుపోనుంది. నక్కను తొక్కిన 20 రాష్ట్రాల రాబడుల్లో వృద్ధి దాదాపు రూ.33వేల కోట్లు; అదే సమయంలో నష్టజాతక రాష్ట్రాలు కోల్పోనున్నది రూ.18,389 కోట్లు! అదనపు రాబడి అదృష్టం తమిళనాడుకు దక్కగా తక్కిన నాలుగు దక్షిణాది రాష్ట్రాలూ నష్టపోనున్న రాబడి రూ.16,640 కోట్లు! వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 11శాతంగా అంచనా కట్టి వేసిన లెక్కల బట్టే ఒక్క ఏడాది నష్టం ఈ స్థాయిలో ఉంటే, అయిదేళ్లూ అదే వరస అయితే దక్షిణాది రాష్ట్రాల గతేంగాను? అంతకుమించి, పద్నాలుగో ఆర్థిక సంఘం రాష్ట్రాలకు చేసిన 42 శాతం కేటాయింపుల్నీ ఒకశాతం తగ్గించడంలో ఎన్‌కే సింగ్ సంఘం గడసరితనం ప్రదర్శించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిందని, వాటి భద్రతాంశాల్నీ పరిగణనలోకి తీసుకోవాలంటూ ఒక శాతం వాటా కేటాయించడం కేంద్రం అజెండాకు అనుగుణంగానే ఉంది. రాబడులు కుంగిన రాష్ట్రాలు అభివృద్ధి గమనంలో చతికిలపడితే ఆ నేరం ఎవరిది?
ఆవిరైన పరిశీలనాంశాలు...
ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఇనుమడించిన విత్త సత్తువ, స్వయం ప్రతిపత్తితో రాష్ట్రాలు తమ పథకాలు కార్యక్రమాల్ని తామే రూపొందించుకొని ప్రగతి పథంలో పయనించేలా చూడాలన్నదే స్వీయ విధానమని 2015 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ ఘనంగా చాటారు. పద్నాలుగో ఆర్థిక సంఘం సూచనల్ని ఎన్‌డీఏ సర్కారు ఔదలదాలుస్తోందన్న సమాచారాన్ని ముఖ్యమంత్రులకు లేఖ ద్వారా వెల్లడిస్తూ ప్రధాని కురిపించిన సౌహార్దం- పదిహేనో ఆర్థిక సంఘం పరిశీలనాంశాల కూర్పులోనే ఆవిరైపోయిందని చెప్పక తప్పదు! 1976 నాటి ఏడో ఆర్థిక సంఘం మొదలు గత పద్నాలుగో ఆర్థిక సంఘం దాకా 1971నాటి జనాభా లెక్కలకే ప్రాధాన్యం ఇచ్చాయి. జనాభాపరంగా సమతూక సాధనకోసం పద్నాలుగో ఆర్థిక సంఘం- 1971 జన సంఖ్యకు 17.5శాతం, 2011 జనాభా లెక్కలకు పదిశాతం వెయిటేజీ ఇవ్వడంతో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.
ఆంధ్రా, తెలంగాణలకు కోత...
అదే నేడు 2011 జన సంఖ్యే ప్రామాణికమై దానికి 15శాతం వెయిటేజి నిర్ధారణ, ఆదాయ అంతరాలకు ఎకాయెకి 45శాతం, జనాభా నియంత్రణ పనితీరుకు 12.5శాతం, పన్ను వసూళ్లకు చేసే కృషికి రెండున్నర శాతం వంతున కొత్త ప్రాతిపదికలు తాజాగా పలు రాష్ట్రాల ఆశల్ని నీరుగార్చాయి. అసలే ఆర్థిక సుడిగుండంలో చిక్కి కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది రూ.1521 కోట్లు కోల్పోనుండగా, తెలంగాణకు దాదాపు రూ.2400 కోట్లు తరుగుపడనుంది! జనాభా స్థిరీకరణలో ముందంజ వేయడమే మహా పాపమైనట్లుగా, దక్షిణాదికి నిధుల వాటా కోసుకుపోవడం ఒక్కటేకాదు; రాష్ట్రాల పనితీరు ప్రాతిపదికల్ని కూర్చి ప్రోత్సాహకాలు అందించే వ్యవస్థ ఏర్పాటునూ కేంద్రం పరిశీలనాంశాల్లో చేర్చినందున- వచ్చే అక్టోబరు చివరినాటికి వెలువడే అయిదేళ్ల సిఫార్సులు మరింత చేదుగా ఉండే అవకాశం లేకపోలేదు! ఈ తరహా ధోరణులు ఆర్థిక సమాఖ్య భావనకే గొడ్డలిపెట్టు!
తప్పుతోన్న అంచనాలు...
పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సులు అమలయ్యే అయిదేళ్ల కాలావధిలో మొత్తం రాబడుల్ని 175 లక్షల కోట్ల రూపాయలుగా కేంద్రం నిరుడు అంచనా కట్టినా, మాంద్యం దెబ్బకు ఖజానాలు కొల్లబోతున్న వాస్తవం కళ్లకు కడుతోంది. ఎటు పోయి ఎటొచ్చినా పస్తులు రాష్ట్రాలకు, శిస్తులు కేంద్రానికి చందంగా ఆర్థిక సంఘం పరిశీలనాంశాల్లో చేతివాటం ప్రదర్శించిన ఎన్‌డీఏ సర్కారు- రాష్ట్రీయ సురక్షానిధి యోచనకు బలంగా కట్టుబాటు చాటుతోంది. దేశ భద్రత భారాన్ని కేంద్రం రాష్ట్రాలూ భరించాలంటూ వెలుగుచూసిన ప్రతిపాదన ప్రకారం- కేంద్రం చెంత పోగుపడే మొత్తంలో సురక్షానిధి మొత్తాన్ని ముందే పక్కనపెట్టి, తక్కిన దాన్నే విభాజ్య నిధిగా గుర్తించి రాష్ట్రాలకు పంచాలన్న కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. అదే జరిగితే, వాటాల కోలాటాలకు అతీతంగా రాష్ట్రాల రాబడులు కుంగిపోవడం ఖాయం!
కారణాలేంటి.?
వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్ రంగ పునర్ వ్యవస్థీకరణల భారంతో రాష్ట్రాలు సతమతమై పోతుండటంతో 2017-’19 మధ్య స్థూల దేశీయోత్పత్తిలో అరశాతం దాకా పెట్టుబడి వ్యయాలు కుంటువడ్డాయని నిరుడు అక్టోబరు నాటి ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో కేంద్రంనుంచి రాష్ట్రాలకు భారీగా నిధుల బదిలీతోపాటు రాష్ట్రాల రుణ సేకరణ పెరిగిందని- స్వీయ ఖర్చుల నిమిత్తం పన్ను, పన్నేతర రాబడులపై రాష్ట్రాలు దృష్టి సారించకపోవడానికి కేంద్రం నుంచి నిధుల ప్రవాహాలూ కారణమన్నట్లుగా తాజా ఆర్థిక సంఘం నివేదికలు ఘోషిస్తున్నాయి. ‘ప్రజాకర్షక పథకా’ల్నీ నిర్వచించే భారాన్ని ఆర్థిక సంఘం తలకెత్తిన కేంద్రం- దాని ద్వారానే ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి గండికొట్టించే పనిలో ఉన్నట్లు తేటపడుతోంది. మాంద్యాన్ని మించిన పెనుముప్పు ఇది!
ఇదీ చదవండి: బడ్జెట్: అంకురాలకు ఆలంబనగా పన్ను మినహాయింపులు