కరోనా మహమ్మారి నేపథ్యంలో భారతీయులకు జీవిత బీమా ప్రాధాన్యం తెలిసొచ్చింది. చాలా మంది పాలసీలు తీసుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు తీసుకున్నవారిలో దాదాపు 29 శాతం పాలసీలు రద్దయినట్లు ప్రైవేటు బీమా సంస్థల సమాచారం ద్వారా తెలుస్తోంది. సకాలంలో ప్రీమియం చెల్లించకపోవడం వల్లే ఇవన్నీ రద్దయ్యాయి. మహమ్మారి మూలంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తి కొంతమంది ప్రీమియంలు చెల్లించలేకపోయారు. మరికొంత మంది ప్రీమియం డ్యూ డేట్ ప్రాధాన్యాన్ని నిర్లక్ష్యం చేశారు. అయితే, రద్దయిన లేక నిలిచిపోయిన పాలసీలు పునరుద్ధరించుకునేందుకు బీమా సంస్థలు అవకాశం ఇస్తాయి.
పాలసీలు ఎప్పుడు రద్దవుతాయి?
ప్రీమియంలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పాలసీ ద్వారా అందే ప్రయోజనాలన్నీ నిలిచిపోతాయి. ప్రీమియం చెల్లించాల్సిన తేదీ తర్వాత గ్రేస్ పీరియడ్ కింద మరికొంత అదనపు సమయాన్ని కూడా ఇస్తారు. సాధారణంగా గ్రేస్ పీరియడ్ 30 రోజులుగా ఉంటుంది. అయినా చెల్లించడంలో విఫలమైతే.. పాలసీని రద్దు చేస్తారు.
పునరుద్ధరణకు ఎంత సమయం ఉంటుంది?
చాలా కంపెనీలు పాలసీల పునరుద్ధరణకు రెండు నుంచి మూడేళ్ల వ్యవధి ఇస్తాయి. దీనికి సంబంధించిన వివరాలు మనకు పాలసీ తీసుకునే సమయంలో ఇచ్చే పత్రాల్లోనే ఉంటుంది. ఆ సమయంలోపే పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే పాలసీతో పాటు వచ్చిన ప్రయోజనాలన్నీ తిరిగి పొందగలుగుతారు.