తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్ స్కోర్​ బాగుంటేనే జీవిత బీమా!

కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం జీవిత బీమా తీసుకునేందుకు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. అదే స్థాయిలో బీమా సంస్థలూ కొత్త పాలసీలను అందిస్తున్నాయి. అయితే బీమా తీసుకునే ముందు మెడికల్ టెస్టులు నిర్వహిస్తుంటాయి ఆయా సంస్థలు. ప్రస్తుతం ఆ అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మెడికల్ టెస్టులు లేకుండా ఆయా సంస్థలు బీమాలు ఎలా అందిస్తున్నాయి? ప్రత్యామ్నాయంగా ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయో తెలుసుకుందాం.

insurance in corona crisis
కరోనా కాలంలో బీమా

By

Published : Apr 15, 2020, 5:38 AM IST

Updated : Apr 15, 2020, 9:37 AM IST

సాధారణంగా బీమా అనగానే డబ్బులు వృథా అని చాలా మంది అనుకుంటారు. అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ భయాలు...ప్రజలను బీమా గురించి ఆలోచించే విధంగా చేశాయి. పిల్లలు, కుటుంబ సభ్యులు ఎవరిపై ఆధారపడి ఉంటారో వారికి జీవిత, ఆరోగ్య బీమాలు తప్పకుండా ఉండాలి.

ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో వైద్య పరీక్షల అవసరం లేకుండా పాలసీలను అందించేందుకు బీమా కంపెనీలు మందుకొస్తున్నాయి. వైద్య పరీక్షలకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడుతున్నాయి.

ప్రత్యామ్నాయం ఏంటి?

సాధారణంగా ఒక కంపెనీ ప్రతినిధి పాలసీ తీసుకోవాలనుకునే వారి దగ్గరకు వచ్చి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా... దీని అవసరం లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నాయి కంపెనీలు. నిబంధనలను సడలిస్తున్నాయి. జీవిత, ఆరోగ్య బీమాల్లో మెడికల్ టెస్టులకు బదులుగా... టెలి అండర్ రైటింగ్, హెల్త్ డిక్లరేషన్, క్రెడిట్ స్కోర్ లాంటిని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ప్రత్యామ్నాయ ఎవాల్యూయేషన్ పద్ధతులను అనుసరించని కంపెనీలు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్లను ఆశ్రయించి పాలసీలను ఆన్ లైన్​లో అందిస్తున్నాయి.

జీవిత బీమా

చాలా కంపెనీలు రూ.50 లక్షల కవరేజీ వరకూ ఆన్లైన్ ద్వారా జీవిత బీమా పాలసీలను అందిస్తున్నాయి. ఆపై తీసుకోవాలంటే సాధారణంగా వైద్య పరీక్షలు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతోన్న దృష్ట్యా ఈ పరిమితిని కొన్ని కంపెనీలు రూ.2.5 కోట్ల వరకు పెంచాయి. కానీ ఈ ఆన్​లైన్ పాలసీ కవరేజీ ఆదాయం, వయస్సు, మెడికల్ హిస్టరీ, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తదితరాలపై ఆధారపడి ఉంటుంది. వైద్య పరీక్షలు లేకుండా ఇచ్చే పాలసీలో కవరేజీ అనేది కంపెనీని బట్టి మారుతుంది.

ఎవరికి ఇస్తున్నాయి?

వివిధ కంపెనీలు ఆదాయం, క్రెడిట్ స్కోరు, వయస్సు, విద్యార్హత, వృత్తి ఆధారంగా ఎంపిక చేసిన వారికి రూ. 2.5 కోట్ల కవరేజీ వరకు టెలిమెడికల్ కన్సల్టేషన్ ద్వారా పాలసీని అందిస్తున్నాయి. టెలిమెడికల్ కన్సల్టేషన్ అనంతరం కూడా మరింత విశ్లేషించాల్సి వస్తే మాత్రమే మెడికల్ టెస్టులను సూచిస్తున్నాయి. ఆన్ లైన్ భాగస్వాములు, బ్యాంకింగ్ భాగస్వాములు, తదితరాల ద్వారా పాలసీ తీసుకుంటే పాలసీ కవరేజీ మారుతుంది.

బీమా ఇస్తున్న ప్రముఖ సంస్థలు..

హెచ్​డీఎఫ్​సీ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ, పీఎన్​బీ మెట్ లైఫ్ తదితర కంపెనీలు రూ.50 లక్షల వరకు ఆన్ లైన్ పాలసీలను అందిస్తున్నాయి.

ఆరోగ్య బీమాలు...

ఆరోగ్య బీమాకు సంబంధించి వైద్య పరీక్షలు.. పాలసీ తీసుకునే వారి వయస్సుపై ఆధారపడి ఉంటాయి. కంపెనీని బట్టి .. 40 లేదా 60 ఏళ్ల నుంచి వైద్య పరీక్షలను తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా కంపెనీలు ప్రస్తుతం టెలీ అండర్ రైటింగ్, వినియోగదారు డిక్లరేషన్ ఆధారంగా 60 ఏళ్ల వరకు పాలసీలను అందిస్తున్నాయి.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన అనంతరం టెలి అండర్ రైటింగ్​కు ప్రక్రియ ప్రారంభమవుతుంది. టెలీ అండర్ రైటింగ్​లో బీమా కంపెనీ నుంచి వైద్య నిపుణులు పాలసీ తీసుకోవాలనుంకుంటున్న వారికి ఫోన్ చేసి ఆరోగ్య స్థితిని తెలుసుకుంటారు. వినియోగదారులు ఇచ్చిన హెల్త్ డిక్లరేషన్స్ ప్రకారం వైద్య నిపుణులు పాలసీ దరఖాస్తు చేసుకున్న వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితితో పాటు వ్యక్తిగత, కుటుంబ వైద్య చరిత్ర తెలుసుకుంటారు.

టెలీ అండర్ రైటింగ్ ద్వారా...

వినియోగదారులు చేసిన డిక్లరేషన్స్ వాస్తవమా? కాదా? అనేది టెలీ అండర్ రైటింగ్ ద్వారా బీమా కంపెనీలకు తెలుస్తుంది. ఇందులో భాగంగా... డాక్టర్లు ఇచ్చే మెడిసిన్​కు సంబంధించి వివరాలు తెలుసుకోవటం ద్వారా వైద్య నిపుణులు దరఖాస్తుదారు ఆరోగ్య స్థితిని కచ్చితంగా తెలుసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిలో ఆరోగ్య పరిస్థితి కచ్చితంగా తెలియదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

క్రెడిట్ స్కోర్​ ఆధారంగా అంచనా...

ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు క్రెడిట్ స్కోరును చూస్తున్నాయి. క్రెడిట్ స్కోరు మంచి స్థాయిలో ఉన్న వారు మంచి జీవన స్థాయిని గడపటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రెడిట్ స్కోరు ఆధారంగా కంపెనీలు పాలసీదారు ఆదాయ స్థాయిపై అవగాహనకు వస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ కవరేజీ తీసుకునే వారికి సంబంధించి ఇందులో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

ఎక్కువ ఆదాయం ఉన్న వారిలో మరణాలు రేటు తక్కువగా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారుడు భవిష్యత్తులో ప్రీమియంలు చెల్లించగలుగుతారా? లేదా ? అనే దానిపైనా కంపెనీలు ఒక అంచనాకు వస్తుంటాయి. వేతన జీవులకు సంబంధించి 750 ఆపై, ఇతరులకు సంబంధించి 650 ఆపై క్రెడిట్ స్కోరును ప్రామాణికంగా కంపెనీలు నిర్దేశించుకుంటున్నాయి.

ఇదీ చదవండి:'లాక్‌డౌన్‌ సరే.. మరి ఉద్దీపన చర్యలేవీ?'

Last Updated : Apr 15, 2020, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details