తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆరోగ్య బీమా పాల‌సీ గురించి ఈ విషయాలు తెలుసా? - ఆరోగ్య బీమా లాభాలు

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్య బీమా పాలసీ ఉండడం చాలా అవసరం. ఈ పాలసీ వల్ల అనుకోని అనారోగ్యం వల్ల కానీ, ప్రమాదం వల్ల కానీ ఆసుపత్రి పాలైతే బిల్లు మొత్తాన్ని బీమా కవర్​ చేస్తుంది. ఫలితంగా ఆర్థిక భారం మనపైన పడకుండా ఉంటుంది.

health insurance and its benefits
ఆరోగ్య బీమా పాల‌సీ గురించి ఈ విషయాలు తెలుసా?

By

Published : Dec 27, 2019, 6:26 AM IST

ఆరోగ్య బీమా పాలసీ వల్ల కలిగే లాభాలు, వాటిని క్లయిమ్​ చేసుకునే విధానం తెలుసుకుందాం.

భార్య‌, భ‌ర్త ఇద్ద‌రికీ ఒకేసారి క్లెయిమ్ :

భార్య, భర్త వారి వారి కంపెనీలలో ఇద్దరికీ ఆరోగ్య బీమా కలిగి ఉంటే , రెండు సంస్థల ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ఉదా :భర్త తాను పనిచేసే సంస్థ ద్వారా తనకు రూ .1 లక్ష వరకు బీమా హామీ ఉంది, భార్యకు కూడా రూ.1 లక్ష వరకు బీమా హామీ ఉంటె, అలాగే భార్య కూడా తాను పని చేస్తున్న సంస్థలో తనకు రూ 1 లక్ష వరకు బీమా హామీ ఉంది, తనతో పాటు తన భర్తకు కూడా రూ 1 లక్ష వరకు బీమా హామీ ఉంటె, అంటే ఇద్దరికీ చెరో రూ 2 లక్ష బీమా హామీ ఉన్నట్లు.

ఒకవేళ భర్తకు అనారోగ్యం వల్ల ఆసుపత్రి బిల్లు రూ. 1.80 లక్షలు అయితే ఒక కంపెనీ నుంచి ల‌క్ష రూపాయ‌లు, మిగిలిన సొమ్మును మరొక కంపెనీ నుంచి పొందవచ్చు. క్యాష్ లెస్ సదుపాయం ఉన్నచోట, రెండు కార్డులను చూపించవచ్చు. క్యాష్ లెస్ అవకాశం లేకపోతె, కంపెనీ నుంచి సొమ్ము పొందవచ్చు. ముందుగా తన కంపెనీకి అప్లై చేసి, మిగతా డ‌బ్బు కోసం మరొక కంపెనీలో క్లెయిమ్ కోసం దాఖ‌లు చేయాలి.

ఒకవేళ మీ వద్ద వ్యక్తిగత / ఫ్యామిలి ఫ్లోటర్ ఆరోగ్య బీమా కూడా ఉన్నట్లయితే, ముందుగా మీరు మీ బృంద బీమా క్లెయిమ్ చేసుకోవడం మేలు. ఆ తరువాత మీ జీవిత భాగస్వామి బృంద బీమాని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తరువాతనే మీ వ్యక్తిగత / ఫ్యామిలి ఫ్లోటర్ పాలసీని వినియోగించుకోవడం మేలు.

ఒకటి కంటే ఎక్కువ‌ పాలసీలు తీసుకోవచ్చా?

ఒకటి కంటే ఎక్కువ పాలసీలను తీసుకునేకన్నా, ఒక కంపెనీతో ఉన్న పాలసీ మొత్తాన్ని పెంచుకోటం మంచిది. ఒకవేళ మీ ప్రస్తుత పాలసీలో కన్నా ఇతర ప్రత్యేకతలు వేరొక పాలసీలో ఉన్నా, మీరు మరొక పాలసీ తీసుకోగల ఆర్ధిక స్థోమత ఉన్నా రెండు పాలసీలు తీసుకోవచ్చు.

మొత్తం హామీ :

అనారోగ్యం వల్ల కానీ, ప్రమాదం వల్ల కానీ, ఆసుపత్రి పాలైతే బిల్లు మొత్తాన్ని చెల్లిస్తారు.

ఒకే కంపెనీ ఆరోగ్య బీమా :

ఒకే కంపెనీ ఆరోగ్య బీమా హామీ కలిగి ఉండటం (వరుసగా) వలన, పాలసీ తీసుకునే నాటికి ఉన్న జబ్బులను, నాలుగు సంవత్సరాల తరువాత కవర్ చేసే సదుపాయం ఉంటుంది. పోర్టబిలిటీ(వేరే కంపెనీ పాలసీ తీసుకోవడం) వినియోగించుకుంటే ఆయా జబ్బుల కవరేజీ కొరకు మరి కొన్నేళ్లు ఆగాల్సి ఉంటుంది. దీర్ఘకాలం పాటు ఆరోగ్య బీమా కలిగివుండటం వలన బోనస్ లేదా డిస్కౌంట్ లభిస్తుంది.

ఉదా: రూ. 3 లక్షల బీమా హామీ ఉన్న పాలసీకి, నాలుగేళ్లు ఒకే కంపెనీతో ఉండటం వలన 50 శాతం బోనస్ ద్వారా అదనంగా మరో రూ 1.50 లక్షలతో కలిపి మొత్తం బీమా హామీ రూ 4.50 లక్షల వరకు లభిస్తుంది. కొన్ని కంపెనీలు డిస్కౌంట్ ద్వారా ప్రీమియంను తగ్గిస్తాయి. అంటే తక్కువ ప్రీమియంతో అదే హామీ మొత్తాన్ని పొందవచ్చు. బీమా కంపెనీతో ఎటువంటి సమస్యలు లేకపోతే , అందులోనే కొనసాగించడం మంచిది.

ఎన్ఆర్ఐల‌కు ఆరోగ్య బీమా :

ఎన్ఆర్ఐలు భారత్​లో ఆరోగ్య బీమా తీసుకోవ‌చ్చు. అయితే చికిత్స కోసం, క్లెయిమ్ పొందేందుకు వారు దేశానికి రావాల్సి ఉంటుంది. ఆరోగ్య బీమా పొందేందుకు నివాస ధ్రువీకరణ పత్రం, ఆదాయపు పన్ను రిటర్నులు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

భారత దేశంలో చికిత్సకు అయ్యే ఖర్చు, అమెరికా, ఐరోపా దేశాలకంటే చాలా తక్కువ. భారత్​లోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాలసీలు తయారు చేస్తారు కాబ‌ట్టి విదేశాల కంటే ఇక్కడ ప్రీమియంలు కూడా చౌకగా ఉంటాయి.

ఉదా:ఒక వ్యక్తికి డెంగ్యూసోకి, సత్వర ఆసుపత్రి చికిత్స అవసరమైతే భారత్​లో అత్యధికంగా రూ. 1-2 లక్షల వరకు అవుతుంది. అదే అమెరికాలో అయితే 10-15 వేల డాల‌ర్ల‌ వరకు అవుతుంది. దీనివల్ల బీమా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుంది. అందువల్ల ఆ వ్యక్తి చికిత్స కోసం భారత్​ రావలసి ఉంటుంది. అక్కడి చికత్సకు చెల్లించకపోవచ్చు.

చికిత్స కోసం క్లెయిమ్ :

అత్యవసర లేదా ముందే అనుకున్న ప్రకారం చికిత్స చేయించుకోవాలనుకున్నపుడు, అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలి. ఇంతకు ముందు చేయించుకున్న వైద్య పరీక్షల, చికిత్సల తాలూకు అన్ని పత్రాలు అందుబాటులో ఉండాలి. వీటి వలన ఈ వ్యాదులు పాలసీ తీసుకోకముందు నుంచే ఉందా లేదా అనేది టిపీఏ (TPA) లకు తెలుస్తుంది.

కావలసిన అన్ని పత్రాలను కలిగి ఉండటం వలన టిపీఏ లు ఇబ్బంది పెట్టకుండా త్వరగా క్లెయిమ్ సెటిల్ చేయవచ్చు. ముందే అనుకున్న ప్రకారం చికిత్స చేయించుకోవాలనుకున్నపుడు, ముందుగానే అనుమతి పొందడం ద్వారా పాలసీదారుడు ఎటువంటి పత్రాలను ఇవ్వవలసిన అవసరం లేకుండా కంపెనీ లేదా టిపీఏ క్లెయిమ్ సెటిల్ చేస్తాయి.

ప్రమాద బీమా పాలసీ లేదా రైడర్ :

విడిగా ఒక పాలసీ ద్వారా లభించే అన్ని ప్రయోజనాలు రైడర్​గా తీసుకుంటే రావు.

ఉదా : ప్రమాద బీమాలో పాక్షిక అంగ వైకల్యం, కాళ్ళు చేతులు, శరీరంలోని ఇతర భాగాలను కోల్పోవటం వంటి వాటికి విడివిడిగా కూడా చెల్లిస్తుంది. అదే రైడర్ గా తీసుకుంటే ఒక్క పాక్షిక వైకల్యానికి మాత్రమే చెల్లిస్తాయి, మిగిలిన వాటికి చెల్లించవు.

రైడర్​గా టర్మ్ ప్లాన్​తో తీసుకుంటే రూ 15 లక్షల బీమాకి ప్రీమియం రూ. 1,000 వ‌ర‌కు ఉంటుంది. అదే, విడిగా ప్రమాద బీమాను తీసుకుంటే ప్రీమియం రూ. 2 వేల‌ వరకు ఉంటుంది.

పాలసీ పత్రం :

పాల‌సీ తీసుకుంటున్న‌ప్పుడు ముఖ్యంగా ఎటువంటి జబ్బులకు చికిత్స అందుతుందో పాల‌సీ ప‌త్రంలో ప‌రిశీలించాలి. కంపెనీలు చికిత్స అందే వాటి గురించే చెప్తాయి కాని, చికిత్స అందని వాటి గురించి చెప్పవు. దీనివల్ల క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంటుంది. అందువల్ల ఎటువంటి వాటికి చికిత్స అందదో కూడా తెలుసుకోవడం ముఖ్యం.

దీనికి ఉదాహరణ కేటరాక్ట్ చికిత్సకు పరిమితులు విధించవచ్చు. చాలావ‌ర‌కు బీమా కంపెనీలు అందించే పట్టికలను మాత్రమే చూస్తారు కానీ, పూర్తి వివరాలను చదవరు. దీనివల్ల క్లెయిమ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు.

ఇక ప్రసూతి ఖర్చుల విషయంలో కూడా చెల్లిస్తారో లేదో చూస్తాం కానీ, ఎంత మొత్తం చెల్లిస్తారో పట్టించుకోరు. అందుకే పాల‌సీ ప‌త్రంలో ముఖ్యంగా ఇలాంటి విష‌యాల‌ను చూడాలి.

పాల‌సీ ప్రీమియం పెరుగుద‌ల‌:

మీరు ఏదైనా మెడిక్లెయిమ్ ప్రీమియంను ప‌రిశీలిస్తే… ప్రతి సంవత్సరం ప్రీమియం పెరుగుద‌ల‌ లేదా సభ్యుని వయసు ఒక శ్లాబ్‌ నుంచి మరొక శ్లాబ్‌ లో మారిన‌ప్పుడు కూడా పెరుగుతుంది.

ఉదా: ఒక వ్యక్తి 30-35 ఏళ్ల శ్లాబ్‌ కి ప్రీమియం రూ 4వేలు అయితే , అదే వ్యక్తి 36-40 ఏళ్ల శ్లాబ్‌ లోకి రాగానే ప్రీమియం రూ.6,500 లకు చేరవచ్చు. అంటే వయసు పెరగగానే ప్రీమియంలో మార్పు వచ్చింది. అందువల్ల లోడింగ్ లేకుండానే ప్రీమియం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్నీ కంపెనీని ముందే అడిగి తెలుసుకోవడం మంచిది.

ఆసుప‌త్రి మార్పు:

చికిత్స పొందుతుండగా, మరింత మెరుగైన సేవల కోసం వేరొక ఆసుపత్రికి మారవచ్చు. అయితే పొందే చికిత్స, పాలసీ నియమ నిబంధనలను అనుసరించి, టీపీఏ నిర్ణయం తీసుకుంటారు. దీనికంటే ఆసుపత్రిలో చేరక ముందే సరైన నెట్‌వ‌ర్క్ ఆసుపత్రిని ఎంచుకోవటం మంచిది.

క్యాష్‌లెస్ స‌దుపాయం తిర‌స్క‌ర‌ణ‌:

టిపీఏకి పంపిన వివరాలు సరిగా లేకపోయినా, అనుమానాదాస్పదంగా ఉన్నా తిరస్కరణకు గురికావచ్చు. అలాగే వ్యాది పాలసీ కవరేజ్​లో లేకపోతే ఇలా జ‌రుగుతుంది. ప్రీ-ఆథరైజేషన్(ముందస్తు అనుమతి ) సకాలంలో టిపీఏకి అందకపోయినా తిరస్కరణకు గురికావచ్చు. అటువంటి సందర్భంలో పాలసీదారుడు చికిత్స పొంది, సొమ్ము చెల్లించి, తరువాత క్లెయిమ్ కోసం టిపీఏకి తగిన పత్రాలను పంపవచ్చు.

చికిత్స పొందుతున్న ఆసుపత్రి, కంపెనీ ప్యానల్ జాబితాలో లేకపోయినా, లేదా చికిత్స పొందుతున్న వ్యాది పాలసీ తీసుకున్నప్ప‌టికే ఉన్నా , నాలుగేళ్ల‌ వరకు చెల్లించే అవ‌కాశం లేని పాల‌సీ అయినా తిరస్కరణకు గురికావచ్చు.

ఇదీ చూడండి:ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకులో 24X7 నెఫ్ట్​ సేవలు

ABOUT THE AUTHOR

...view details