ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఒక కొత్త వ్యవస్థను రూపొందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే పన్ను చెల్లింపుదారులు అప్లికేషన్ ఫారమ్‌ను నింపకుండానే పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య) కార్డును సులభంగా, తక్షణమే పొందే వీలు ఉంటుంది. ఈ సౌకర్యం ఆధార్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 'పన్ను చెల్లింపుదారుల ఆధార్ ఆధారిత ధ్రువీకరణను కూడా ప్రవేశపెడుతున్నాం. పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం, ఎటువంటి దరఖాస్తు ఫారమ్‌ను నింపాల్సిన అవసరం లేకుండా, ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా పాన్ కార్డును తక్షణమే కేటాయించే వ్యవస్థను త్వరలో ప్రారంభించున్నాం' అని తెలిపారు.