హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ పోలీసుల కంట పడితే అంతే! మన బైక్ పేరు మీద ఓ చలానా పడిపోయినట్టే. నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనాన్ని నడిపేవారితో పాటు.. వెనక కూర్చునేవారు కూడా హెల్మెట్(two helmet rule) తప్పనిసరిగా ధరించాలి. దీని ప్రకారం ఒక బైక్ ఉన్నవారు రెండు హెల్మెట్లు తప్పక కొనాలి.
అయితే, ఈ విషయంలో వాహనదారులకు ఊరట కలిగించే అంశం ఒకటి ఉంది. కొత్త బైక్ కొనేవారికి రెండు హెల్మెట్లు ఉచితంగా(free helmet with new bike) ఇవ్వాలన్న నిబంధన ఒకటి 1989 కేంద్ర మోటార్ వాహనాల చట్టంలో ఉంది. చట్టంలోని రూల్ 138(4)(f) ప్రకారం.. ఏ రకం బైక్ కొన్నా రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందే. విక్రేతలే ఈ వ్యయాన్ని భరించాలి. ఉచితంగా ఇచ్చే హెల్మెట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) నిబంధనలకు లోబడి ఉండాలి.