దేశ వ్యాప్తంగా కోడిమాంసం విక్రయాలు నెల రోజుల్లో 50 శాతానికిపైగా క్షీణించాయని గోద్రేజ్ ఆగ్రోవెట్ మేనేజింగ్ డైరెక్టర్ బీఎస్ యాదవ్ తెలిపారు. కోడి మాంసం తింటే కరోనా వైరస్ సోకుతుందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రబలుతున్న వదంతులే ఇందుకు కారణమయ్యాయని చెప్పారు. ఫలితంగా ధర 70% వరకు పతనమైందని.. కోడి కిలో ధర రూ.100 నుంచి రూ.30-35కి పడిపోయిందన్నారు.
ఇదే సమయంలో కోడి బరువు కిలో పెరిగేందుకు వ్యయం రూ.75 అవుతోందని... కిలో మాంసం రూ.80-120 మధ్య విక్రయమవుతోందని యాదవ్ వివరించారు. గోద్రేజ్ ఆగ్రోవెట్‌కు చెందిన పౌల్ట్రీ సంస్థ గోద్రేజ్ టైసన్ ఫుడ్స్ అమ్మకాలు గత నెలలో 40 శాతం తగ్గాయని ఆయన చెప్పారు. నిల్వలు పేరుకుపోతున్నందున, కోళ్లఫారాల నిర్వాహకులు తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని చెప్పారు. చికెన్ తింటే కరోనా సోకదనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేయడాన్ని ఆయన ప్రస్తావించారు.