చైనా నుంచి కరోనా వైరస్ (కొవిడ్-19) ఇతర దేశాలకు విస్తరిస్తోంది. ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లలో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతోంది. ఐరోపా దేశాలైన ఇటలీ, ఫ్రాన్స్‌లలో కొవిడ్- 19 కొత్త కేసులతో, భయాలు పెరిగిపోయాయి. ఇటలీలో 12 మంది మరణించగా, ఇంకో 320 మంది చికిత్స పొందుతున్నారు.. ఫ్రాన్స్‌లో రెండో మరణం నమోదైంది. ఈ పరిస్థితుల్లో భారత్ సహా వివిధ దేశాల్లోని ఫార్మా, బయోటెక్ కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్ ఆవిష్కరణకు యత్నాలు ముమ్మరం చేశాయి. చైనా, జపాన్, కొరియా, అమెరికా కంపెనీలు ఈ దిశగా కొంత సానుకూల ఫలితాలు కనబరుస్తున్నాయి.
ఆ ఔషధం పనికొస్తుందా?
యాంటీ-వైరల్ ఔషధమైన 'ఫవిపిరవిర్' ను కరోనా వ్యాక్సిన్‌గా అభివృద్ధి చేయవచ్చని చైనా, జపాన్ దేశాల్లోని కొన్ని ఔషధ కంపెనీలు భావిస్తున్నాయి. దీనిపై పరీక్షలు చేపట్టడానికి చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్ ప్రభుత్వం చైనాలోని ఝెజియాంగ్ హిసున్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఈ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 'ఫవిపిరవిర్'ను జపాన్‌కు చెందిన టయోమా కెమికల్ (ఫ్యూజీఫిల్మ్ గ్రూపు కంపెనీ) అభివృద్ధి చేసింది. దీన్ని అక్కడ 'అవిగన్' పేరుతో వ్యవహరిస్తారు. ఆర్‌ఎన్‌ఏ వైరస్‌లను ఇది బాగా అడ్డుకోగలదని నిరూపణ అయింది. అందుకే కరోనా వైరస్‌ను అదుపు చేసే శక్తి దీనికి ఉండొచ్చని అక్కడి శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. కరోనా వైరస్ బాధితులకు 'అవిగన్' ఔషధాన్ని ఇచ్చి పరిశీలిస్తామని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కట్సునొబు కాటో ఇటీవల చెప్పారు. ఎన్నోరకాల ఇన్ఫుయంజా వైరస్‌ల చికిత్సలో దీన్ని వినియోగించిన సందర్భాలున్నాయి. ఆరేళ్ల క్రితం ఎబోలా వైరస్ సోకినప్పుడు.. చికిత్సలో అవిగన్ వినియోగించారు. గునియా ప్రభుత్వం అధికారికంగా ఎబోలా వైరస్ చికిత్సలో ఈ ఔషధాన్ని వాడటానికి అనుమతి ఇచ్చింది.
అమెరికాలో..
కరోనా వైరస్ చికిత్సకు ఔషధం ఏదీ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి కోసం రాలేదు. ఇక వ్యాక్సిన్ మాటెక్కడ. కానీ అమెరికాలోని బయోటెక్, ఫార్మా కంపెనీలు కొన్ని కరోనా వ్యాక్సిన్ ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎబోలా, జికా వైరస్‌కు వ్యాక్సిన్లు ఆవిష్కరించిన ఇనోవియో ఫార్మాస్యూటికల్స్ త్వరలోనే కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకురాగలననే ధీమా వ్యక్తం చేస్తోంది. కరోనా వైరస్ జనిటిక్ సీక్వెన్స్‌ను చైనా శాస్త్రవేత్తలు గత నెలలో విడుదల చేశారు. ఆ వెంటనే ఇనోవియో ఫార్మా శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి వ్యాక్సిన్‌కు రూపకల్పన చేశారు. దీన్ని ప్రస్తుతం ఎలుకల మీద ప్రయోగిస్తున్నారు. సానుకూల ఫలితాలు కనిపిస్తే రెండు మూడు నెలల వ్యవధిలో మనుషుల మీద ప్రయోగాలు చేసే దశకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. అమెరికాకే చెందిన బయోటెక్ సంస్థ మొడెర్నా కూడా కరోనా వ్యాక్సిన్ (ఎంఆర్‌ఎన్‌ఏ-1273) పై త్వరలో పరీక్షలు ప్రారంభించనుంది. కొన్ని బ్యాచ్ వ్యాక్సిన్లను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్ (నియాడ్) కు పంపినట్లు వివరించింది. జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్‌కే, గిలీడ్ సైన్సెస్ వంటి అమెరికన్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయి. గిలీడ్ సైన్సెస్‌కు చెందిన ‘రెమ్‌డెసివిర్’ అనే ఔషధం కరోనా వైరస్‌ను అదుపు చేయగలుగుతుందని ఆశిస్తున్నారు.
మనదేశంలో..
అగ్రగామి సంస్థల్లో ఒకటైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అమెరికాకు చెందిన కోడాజెనిక్స్ అనే కంపెనీతో కలిపి వ్యాక్సిన్ తయారీ సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం ఎలుకలపై ప్రయోగిస్తున్నామని, త్వరలో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించి ఫలితాలు నిర్ధారించుకోనున్నట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. నాలుగేళ్ల క్రితం స్వైన్‌ఫ్లూ విస్తరించినప్పుడు మనదేశానికి చెందిన పలు కంపెనీలు ఔషధాన్ని తయారు చేశాయి. ఆ కంపెనీలే కరోనా వ్యాక్సిన్‌పై అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:ఇల్లు కొంటే మంచిదా? అద్దెకుంటే మంచిదా?