కల్తీ పాల వల్ల చిన్నారుల అనారోగ్యం పాలవడం ఐఐటీ హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సహాయ ఆచార్యుడు శివగోవింద్ సింగ్‌ను కదిలించింది. పరిశోధక విద్యార్థి సురేష్ కుమార్ త్రిపాఠితో కలిసి 40 రకాలుగా పాలను కలుషితం చేస్తున్నట్లుగా కనుగోన్నారు. ఒక్కో రకమైన కాలుష్య కారకానికి ఒక్కో రకమైన పరీక్ష చేయాలి. ఇవి సామాన్యుడికి అందుబాటులో లేని పరిస్థితి. ప్రతి ఒక్కరికీ అందుబాటులో అతి తక్కువ ధరలో, సులువుగా గుర్తించేలా పరికరం తయారు చేయడానికి ప్రయోగాలు ప్రారంభించారు.
పాలలోని ఎలక్ట్రికల్ కండక్టవిటీ, పీహెచ్ స్థాయితో పాటు మరో రెండు ప్రధాన లక్షణాల్లో వచ్చే మార్పుల ద్వారా ఎంత కల్తీ అయ్యాయో గుర్తించేలా బయోచిప్ ఆధారంగా పరికరాన్ని రూపొందించారు. గణాంకాలతో సహా తెలుసుకోవచ్చు. స్మార్ట్ ఫోనులో చూసుకునే విధంగా ప్రత్యేక యాప్‌నూ అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే సాకేంతికంగా విజయం సాధించిన వీరి పరిశోధన.. త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.