Wrestlers protest update : లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసును ఎత్తివేసేందుకు అనుమతించేలా దిల్లీ పోలీసులు న్యాయస్థానాన్ని కోరుతూ నివేదిక సమర్పించారు. రెజ్లర్లను వేధించారన్న కేసులో 500 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు.. మైనర్ ఆరోపణలపై నమోదైన కేసును రద్దు చేయాల్సిందిగా కోరారు. మైనర్ రెజ్లర్ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బాలిక, ఆమె తండ్రి ఇచ్చిన వాంగ్మూలం మేరకు పోక్సో కేసు రద్దుకు సంబంధించి నివేదిక సమర్పిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. మరోవైపు, మిగతా రెజ్లర్ల ఆరోపణలపై ఛార్జ్‌షీట్ నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపులు, నిఘా వేయడం (స్టాకింగ్) వంటి నేరాల గురించి ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించినట్లు వెల్లడించారు. కోర్టులో దీనిపై తదుపరి విచారణ జులై 4న జరగనుంది.
"పోక్సో కేసు విషయానికి వస్తే.. మా విచారణ పూర్తైన తర్వాత సీఆర్పీసీ సెక్షన్ 173 ప్రకారం కేసును రద్దు చేయాలని కోరుతూ నివేదిక సమర్పించాం. ఫిర్యాదుదారు (మైనర్ తండ్రి)తో పాటు బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇతర రెజ్లర్ల ఆరోపణలపై ఐపీసీ సెక్షన్లు 354, 354ఏ, 354డీ ప్రకారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశాం. సస్పెన్షన్‌కు గురైన రెజ్లింగ్ ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రెటరీ వినోద్ తోమర్‌పై ఐపీసీ సెక్షన్లు 109, 354, 354ఏ, 506 ప్రకారం ఛార్జ్‌షీట్ నమోదు చేశాం."
-దిల్లీ పోలీసులు