తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నివారణే విజేత.. ఎయిడ్స్​ను తరిమేయండిక!

ఎయిడ్స్.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సాంక్రమిక వ్యాధి. తాజాగా కరోనా మహమ్మారి విసిరిన పంజాతో హెచ్​ఐవీ బాధితులపై తీవ్ర ప్రభావం పడింది. నివారణ చర్యలకూ ఆటంకం కలుగుతోంది. డిసెంబర్ 1న ఎయిడ్స్ డే నిర్వహించుకుంటున్న నేపథ్యంలో.. ఈ వ్యాధి వివరాలు, చికిత్స, నివారణ చర్యలు తదితర అంశాలపై సమగ్ర కథనం.

World AIDS Day urges for global solidarity, shared responsibility
నివారణే విజేత.. ఎయిడ్స్​ను తరిమేయండిక!

By

Published : Dec 1, 2020, 6:03 AM IST

90వ దశకం తర్వాత ప్రపంచం ఎంతగానో పురోగమించింది. కానీ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న హెచ్​ఐవీ మాత్రం ఇప్పటికీ ప్రధాన సమస్యగానే మిగిలిపోయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హెచ్​ఐవీ బాధితుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

బలహీనమైన వైద్య వ్యవస్థ ఉన్న దేశాల్లో హెచ్​ఐవీ నివారణ చర్యలకు ఆటంకం కలిగింది. ఈ చర్యలు కొనసాగకపోతే.. చాలా మందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.

ఎయిడ్స్ డే

1988 నుంచి డిసెంబర్ 1ని ప్రపంచ దేశాలు ఎయిడ్స్ నివారణ దినంగా పాటిస్తున్నాయి. ఎయిడ్స్ సోకిన వ్యక్తులకు ఈ రోజున సంఘీభావం ప్రకటిస్తాయి. ఐక్యరాజ్య సమితి సంస్థలు, ప్రభుత్వాలు, సివిల్ సొసైటీలు ఈ వ్యాధికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపడతాయి. ప్రతి ఏటా ప్రత్యేకమైన ఇతివృత్తంతో ఈ ప్రచారం నిర్వహిస్తాయి. 'ప్రపంచవ్యాప్త సంఘీభావం, భాగస్వామ్య కర్తవ్యం' పేరిట ఈసారి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరగుతోంది.

"హెచ్​ఐవీ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ఇప్పటివరకు 3.3 కోట్ల మంది ప్రాణాలు తీసింది. 2019 చివరినాటికి 3.8 కోట్ల మందికి ఈ వ్యాధి సోకింది."

-డబ్ల్యూహెచ్​ఓ

హెచ్​ఐవీ-ఎయిడ్స్​ అంటే?

హెచ్ఐవీ(హ్యూమన్ ఇమ్యునోడెఫీషియన్సీ వైరస్) అనేది ఓ వైరస్. మానవ శరీరంలో ఇన్ఫెక్షన్​లపై పోరాడే కణాలపై దాడి చేస్తుంది. తద్వారా ఒక వ్యక్తిని ఇతర ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. శరీరంలోని కొన్ని ద్రవాలు ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తే.. హెచ్​ఐవీ వ్యాపిస్తుంది. సాధారణంగా సురక్షితం కాని శృంగారం(కండోమ్ లేని సెక్స్) లేదా హెచ్​ఐవీ రోగికి ఉపయోగించిన ఇంజెక్షన్, డ్రగ్ పరికరాలను ఇతరులపై ప్రయోగించడం ద్వారా ఇది సోకుతుంది.

హెచ్​ఐవీ చివరి దశనే ఎయిడ్స్​గా పరిగణిస్తారు. ఈ దశలో శరీర రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. దీనికి చికిత్స లేదు.

భారత్​లో హెచ్ఐవీ

కేంద్ర వైద్య శాఖ హెచ్​ఐవీ అంచనాల నివేదిక(2019) ప్రకారం దేశంలో 23.49 లక్షల మంది హెచ్​ఐవీ(పీఎల్​హెచ్​ఐవీ) బాధితులు ఉన్నారు. అయితే దేశంలో ఈ వ్యాధి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. 2010 నుంచి 2019 మధ్య హెచ్​ఐవీ కొత్త కేసుల సంఖ్య 37 శాతం తగ్గిపోయింది. 2019లో కొత్తగా 69 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. 58 వేల 960 మంది ఎయిడ్స్ కారణంగా మరణించారు.

లక్షణాలు

హెచ్​ఐవీ బారినపడ్డవారికి తొలుత ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ వ్యాధి ప్రబలుతున్నకొద్దీ.. ఇన్​ఫ్లుయెంజా తరహా లక్షణాలు బయటపడతాయి. జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. తర్వాత ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. బరువు తగ్గడం, జ్వరం, విరేచనాలు, దగ్గు మొదలవుతాయి. శరీరం ఇతర వ్యాధులను ఎదుర్కొనే శక్తి కోల్పోతుంది. చికిత్స లేకపోతే.. టీబీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది.

ఎలా బయటపడుతుంది

ర్యాపిడ్ టెస్టుల ద్వారా హెచ్​ఐవీని గుర్తించవచ్చు. ఇంట్లోనే పరీక్ష నిర్వహించుకోవచ్చు. ఒక్క రోజులో ఫలితం వచ్చేస్తుంది. అయితే వ్యాధిని నిర్ధరించుకునేందుకు ల్యాబొరేటరీ పరీక్ష అవసరం. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే ఇతరులకు సోకకుండా జాగ్రత్తపడొచ్చు.

చికిత్స

హెచ్​ఐవీని పూర్తిగా నివారించవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఎఫెక్టివ్ ఆంయీరెట్రోవైలర్ ట్రీట్​మెంట్(ఏఆర్​టీ) ద్వారా హెచ్​ఐవీని బిడ్డకు సోకకుండా అరికట్టవచ్చు. శృంగారంలో పాల్గొనేముందు కండోమ్​ను ధరించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చు. రోగనిరోధక యాంటీ రెట్రోవైరల్ మందులను కూడా ఉపయోగించవచ్చు. యాంటీ రెట్రోవైలర్ థెరపీ ద్వారా ఒకటి లేదా రెండు ఔషధాలను ఉపయోగించి హెచ్​ఐవీకి చికిత్స చేయవచ్చు.

ఏఆర్​టీ చికిత్స హెచ్​ఐవీని తగ్గించకపోయినా.. రక్తంలో వీటి ప్రతిరూపాలు ఉండటం వల్ల వైరస్ గుర్తించని స్థాయికి పడిపోతుంది. అయితే బాధితులు తమ జీవితాంతం ఏఆర్​టీ చికిత్సను తీసుకోవాల్సి ఉంటుంది.

జయించినవారూ ఉన్నారు

హెచ్​ఐవీ నుంచి బయటపడి తిమోతీ రే బ్రౌన్ అనే వ్యక్తి అప్పట్లో చరిత్ర సృష్టించారు. 2007-2008 సమయంలో స్టెమ్ సెల్స్ మార్చుకొని ఈ వ్యాధిని జయించారు. అయితే క్యాన్సర్ బారినబడి 2020 సెప్టెంబర్​లో మరణించారు. ఈయన్ను బెర్లిన్ రోగిగా పిలుస్తారు. లండన్​కు చెందిన ఆడమ్ కాస్టిల్లెజో అనే వ్యక్తి సైతం ఇదే విధంగా హెచ్​ఐవీ నుంచి కోలుకున్నారు.

ఇదీ చదవండి-ఎయిడ్స్​ నుంచి పూర్తిగా కోలుకున్న రెండో వ్యక్తి ఇతనే!

ఇలాంటి ట్రాన్స్​ప్లాంట్​ చికిత్సలు ప్రమాదకరం కావడం, దాతలు దొరకకపోవడం వల్ల ఇవి ఎక్కువగా జరగడం లేదు.

కరోనా ఎఫెక్ట్

ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ గణాంకాల ప్రకారం కరోనా వల్ల.. 2020-22లో లక్షా 23 వేల నుంచి రెండు లక్షల 93 వేల వరకు అదనపు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. 69 వేల నుంచి లక్షా 48 వేల అదనపు మరణాలు సంభవించే అవకాశం ఉంది.

కరోనా వల్ల ఆఫ్రికా సహా ప్రవంచ వ్యాప్తంగా ఏఆర్​వీ మందుల సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా వీటిని ఉపయోగించే రెండు కోట్ల 40 మంది బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

ఈ డ్రగ్ సరఫరాకు ఆరు నెలల పాటు అంతరాయం కలిగితే.. 5 లక్షల ఎయిడ్స్ మరణాలు అదనంగా నమోదవుతాయని యూఎన్ ఎయిడ్స్ సర్వేలో వెల్లడైంది.

ఇదీ చదవండి-బాల్యంలోనే ఎయిడ్స్​ ముప్పు: యూనిసెఫ్​

ABOUT THE AUTHOR

...view details