బంగాల్లోని నందిగ్రామ్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. పార్టీ నుంచి వేరువడి భాజపాలో చేరిన సువేందు అధికారిపై పోటీ చేసేందుకు.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగప్రవేశం చేయడం, ఆ తర్వాత ఇరువురు నేతలు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ వాగ్యుద్ధానికి దిగడం.. ఇక్కడి రాజకీయాలను వేడెక్కించింది.
అయితే, ఈ పరిణామాల వెనుక మరుగునపడిన ఓ నియోజకవర్గం ఉంది. అదే... దీదీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపుర్. రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు మమత. ఈ నియోజకవర్గానికి ఏడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. సొంత నియోజకవర్గానికి దీదీ దూరం కావడం.. ఇక్కడి ఫలితాలపై ఏమేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
తగ్గుతున్న టీఎంసీ ప్రభావం!
2011లో మమతా బెనర్జీ 49,936 ఓట్ల తేడాతో భవానీపుర్ నుంచి గెలిచారు. ఆ ఎన్నికల్లో 63.78 శాతం పోలింగ్ నమోదు కాగా.. దీదీ మెజార్టీనే 21.91 శాతం. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భవానీపుర్‌లో టీఎంసీ వ్యతిరేక పవనాలు వీచాయి. దక్షిణ కోల్‌కతా లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన ఈ భవానీపుర్‌లో టీఎంసీ కన్నా భాజపాకు 185 ఓట్లు అధికంగా వచ్చాయి. దక్షిణ కోల్‌కతా నుంచి టీఎంసీ తరపున పోటీ చేసిన సౌగతా రాయ్.. 1.36 లక్షల మెజార్టీ దక్కించుకున్నప్పటికీ భవానీపుర్‌లో మాత్రం ఫలితం ప్రతికూలంగానే వచ్చింది.
ఆ తర్వాత దిద్దుబాటు చర్యలతో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచే రంగంలోకి దిగారు దీదీ. ఫలితాల్లో విజయం సాధించినా.. మెజారిటీ మాత్రం సగానికి పడిపోయింది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్‌మున్షీ బరిలోకి దిగగా.. ఆమెపై 26,299 ఓట్ల తేడాతో మమత గెలుపొందారు.
కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ 3,168 ఓట్ల ఆధిక్యాన్ని కనబర్చింది టీఎంసీ. కానీ మమత నివాసం ఉన్న వార్డు నెంబర్ 73లో భాజపాపై 496 ఓట్ల తేడాతో వెనకబడింది.