తెలంగాణ

telangana

ETV Bharat / bharat

''మహా'లో ఆందోళనకరంగా కరోనా విజృంభణ'

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభించటంపై ఆందోళన వ్యక్తం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. పరిస్థితులను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మరోవైపు.. కరోనా కట్టడికి కొన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధించాల్సిన అవసరం ఉందన్నారు మహా సీఎం ఉద్ధవ్​ ఠాక్రే. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

By

Published : Mar 11, 2021, 5:34 PM IST

Updated : Mar 12, 2021, 12:05 PM IST

Union Health ministry
మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరం: కేంద్రం

దేశంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంది. అక్కడ లక్షకుపైగా యాక్టివ్​ కేసులు ఉన్నాయని.. మధ్యప్రదేశ్​, గుజరాత్​, హరియాణాలోనూ అలాంటి పరిస్థితే ఉందని తెలిపింది. ఆయా రాష్ట్రాల అధికారులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశమైనట్లు వెల్లడించింది. 'మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే.. ప్రస్తుతం కరోనా కేసుల వృద్ధిలో మ్యూటెంట్లు కనిపించలేదు. కేసుల పెరుగుదలకు ప్రధానంగా టెస్టులు, కేసుల ట్రేసింగ్ తగ్గించటం​, కొవిడ్​ పట్ల ప్రజల నిర్లక్ష్యం, పెద్ద ఎత్తున సమావేశాలే కారణం' అని పేర్కొన్నారు ఐసీఎంఆర్​ డీజీ డాక్టర్​ బలరామ్​ భార్గవ.

మహారాష్ట్ర పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు నీతి ఆయోగ్​ సభ్యులు డాక్టర్​ వీకే పాల్​. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమన్నారు.

టీకాల కొరత లేదు..

దేశంలో మార్చి 11 వరకు 2.56 కోట్ల టీకా డోసులు అందించినట్లు తెలిపారు ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​. ప్రైవేటు వ్యవస్థల భాగస్వామ్యంతో టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు వెల్లడించారు. 71 శాతం ప్రజా ఆరోగ్య కేంద్రాలు, 28.77 శాతం ప్రైవేటు కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.

తగ్గనున్న ధరలు..

టీకా ధరలపై పునఃపరిశీలన చేశామని, ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్​ తయారీదారులతో చర్చలు జరిపిన తర్వాత.. ఈ ప్రకటన చేశారు భూషణ్​. డోసుకు రూ. 200 లోపే లభిస్తుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం.. ప్రైవేటులో ఒక టీకా డోసు ధర రూ. 250గా నిర్ణయించింది కేంద్రం.

ఏ రాష్ట్రంలోనూ టీకాల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వ్యాక్సిన్​ తీసుకున్న వారిలో 0.020 శాతం మాత్రమే ప్రతికూల ప్రభావం కనిపించినట్లు చెప్పారు.

లాక్​డౌన్​ అవసరం: ఉద్ధవ్​

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. వైరక్​ కట్టడికి కొన్ని ప్రాంతాల్లో లాక్​డౌన్​ విధించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని రోజుల్లోనే ఆయా ప్రాంతాల్లో లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ముంబయిలోని సర్​ జేజే ఆసుపత్రిలో కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు ఠాక్రే. ముంబయి, నాశిక్​, పుణె, అకోలా, నాగ్​పుర్​లో కేసుల ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలు పాటించాలను కోరారు. వ్యాక్సిన్​కు అర్హులైన వారు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్​డౌన్​ వంటి చర్యలు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చేపట్టినట్లు గుర్తు చేశారు.

ఇదీ చూడండి:నాగ్​పుర్​లో మళ్లీ లాక్​డౌన్​- త్వరలో పుణెలోనూ!

Last Updated : Mar 12, 2021, 12:05 PM IST

ABOUT THE AUTHOR

...view details