తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాషను మరిచిపోతే సంస్కృతీ దూరం' - venkaiah naidu news

ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని భావితరాలకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ ఆమెరికా 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సభా విశేష సంచికను ఆయన ఆవిష్కరించారు.

venkaiah naidu news
venkaiah naidu news

By

Published : Oct 25, 2021, 5:18 AM IST

భాషను మరిచిపోతే తత్సంబంధిత సంస్కృతి కూడా దూరమవుతుందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తెలుగులోని అనంత సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతలను- తెలుగుభాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలని పిలుపునిచ్చారు. 2020 అక్టోబరులో జరిగిన ప్రపంచ తెలుగు సదస్సులోని అంశాలను మేళవించి 'వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా సంస్థ రూపొందించిన 100వ తెలుగు గ్రంథాన్ని ఆయన అదివారం దిల్లీ నుంచి అంతర్జాలం ద్వారా అవిష్కరించి ప్రసంగించారు. దాన్ని దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేయడాన్ని, 2 ఏళ్లుగా నిరంతరం తెలుగు భాష సదస్సులను నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్‌ను అభినందించారు.

"తెలుగు భాష, సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్నీ వదులుకోరాదు. ప్రతి ఒక్కరి నుంచీ ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నాను. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం.. భాషాభివృద్ధికి ఎన్నో నూతన అవకాశాలను సృష్టిస్తోంది. వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా భాష, సంస్కృతులను కాపాడుకోవాలి. నిద్ర లేచింది మొదలు మనం మాట్లాడే మాటల్లో ఎన్నో ఆంగ్ల పదాలు దొర్లుతుండటం ఆందోళనకరం. ఉన్న పదాలను సమర్థవంతంగా వాడు కోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరం"

-వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి

ఈ కార్యక్రమంలో వంగూరి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వంగూరి చిట్టెన్‌రాజు, వంశీ ఆర్ట్స్‌ థియేటర్‌ వ్యవస్థాపకుడు వంశీ రామరాజుతో పాటు, పలుదేశాల ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఈనెల 29న ఇటలీకి మోదీ- జీ20 సదస్సుకు హాజరు

ABOUT THE AUTHOR

...view details